Dhoni About Rotation Policy : గత రెండు దశాబ్దాలుగా భారత క్రికెట్‌లో రొటేషన్ పద్ధతి ఎక్కువగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అంతకుముందు ఏ సిరీస్ ఆడినా తుది జట్టులో మాత్రం ఎప్పుడూ అదే 11 మంది బరిలోకి దిగేవారు. ఆ తర్వాత బీసీసీఐ భారీ మార్పుల చేయడం మొదలుపెట్టింది. ప్రతీ క్రికెటర్‌కూ అవకాశం రావాలని భావించి, రొటేషన్ పద్ధతితో మ్యాచ్‌లను నిర్వహించేది.
ఇక ఐపీఎల్ ఎంట్రీ వచ్చాక ప్రతి ప్లేయర్ కూడా తన సత్తా నిరూపించుకునేందుకు ఓ మంచి వేదికగా మారింది. దీంతో ప్రతీ ప్లేయర్ నేషనల్ టీమ్‌లోకి వచ్చేందుకు సిద్ధమైపోతున్నాడు. అందుకే ప్రస్తుతం భారత జట్టులో మంచి పోటీ వాతావరణం కనిపిస్తోంది.
పైగా మూడు ఫార్మాట్లు ఉండటం వల్ల యంగ్ క్రికెటర్స్‌కు కూడా ఛాన్స్‌లు ఎక్కువగా దక్కుతున్నాయి. ఇప్పుడు భారత్ వరుసగా మూడు సిరీస్‌లను ఆడుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి రొటేషన్ పాలసీ చర్చ తెరపైకి వచ్చింది.
అయితే ఇలాంటి రొటేషన్ పాలసీ విధానం భారత క్రికెట్‌కు అవసరమని మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గతంలో(2006లోనే) చెప్పినట్లు ఓ క్రీడా వెబ్సైట్ పేర్కొంది. అప్పుడు పీటీఐతో ధోనీ చేసిన సంభాషణను క్రికెట్ అభిమానుల కోసం మరోసారి గుర్తు చేసింది.
"క్రికెట్‌లో రొటేషన్ పద్ధతి ఎంతో కీలకం. అప్పుడు ప్లేయర్స్‌కు తమకు ఛాన్స్ రాలేదనే బాధ కనిపించదు. అలానే వరుసగా మ్యాచ్‌లు ఆడే వారికి రెస్ట్ కూడా ఇచ్చినట్లు అవుతుంది. మళ్లీ వారు ఉత్సాహంతో బరిలోకి దిగుతారు. రొటేషన్ పాలసీ ప్రతి క్రికెటర్‌కు కూడా తుది జట్టులో ఆడి తమ సత్తా నిరూపించుకునేందుకు ఓ చక్కని మార్గం. ఒక వేళ ఎప్పుడూ అదే 11 మందితో తుది జట్టులో బరిలోకి దిగితే, కొత్త ప్లేయర్స్‌కు అవకాశం రావడం చాలా కష్టంగా మారుతుంది. అదే 15 మందితో ఉన్న స్క్వాడ్‌లో ప్రతి ఒక్కరినీ ఆడిస్తే అనుభవం కూడా పెరుగుతుంది. వారిలోనూ అభద్రతా భావం రాదు. సుదీర్ఘ కాలం పాట కెరీర్ కొనసాగాలంటే రొటేషన్ పాలసీ ఎంతో మంచిది. దీనికి మించినది మరొకటి లేదు" అని ధోనీ అన్నాడు. కాగా, మహీ ఈ వ్యాఖ్యలు చేసిన సమయానికి, అతడు అంతర్జాతీయ క్రికెట్‌లోకి (2005లో) అడుగుపెట్టి కేవలం ఒక్క ఏడాది మాత్రమే అయింది.
ఐపీఎల్ 2025లో ధోనీ(IPL 2025) - ఐపీఎల్ 2025 సీజన్‌లో బరిలోకి దిగడంపై మహీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ విధానాలపై బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరు లోగా ఆయా ఫ్రాంచైజీలు తమ జాబితాలను సమర్పించాలి. దీంతో మహీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
మాజీ కెప్టెన్‌ను రూ.4 కోట్లకు రిటైన్ (అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా) చేసుకుంటారనే ప్రచారం సాగుతోంది. అయితే, సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. "సీఎస్కే తరఫున మహీ ఆడాలని కోరుకుంటున్నాం. కానీ, అతడు ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదు. ఈ వారం రోజుల్లో చెబుతాడని అనుకుంటున్నాం." అని తెలిపారు. మరోవైపు ధోనీ ఐపీఎల్ 2025లో మెంటార్‌గా కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
'ఒక్కఫోన్ కాల్ చేయండి చాలు - వచ్చేస్తా' : సర్ప్రైజ్ ఇచ్చిన వార్నర్
'టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడేందుకు సిద్ధమయ్యా - కానీ రోహిత్ అలా అనేసరికి!'