Team India Top 5 Moments In Under-19 WC:ఐసీసీ అండర్- 19 వరల్డ్ కప్ 2024 తుది దశకు చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న భారత యువ జట్టు మరో ట్రోఫీని గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఇప్పటికే మన జట్టు దక్షిణాఫ్రికాను చిత్తుచేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన రెండో సెమీస్‌లో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా వికెట్ తేడాతో నెగ్గి ఫైనల్‌కు చేరింది. ఇక భారత్- ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 11(ఆదివారం)న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే కుర్రాళ్ల కోసం నిర్వహించే ప్రపంచకప్ ఎప్పుడు మొదలైంది? అందులో భారత్ ప్రదర్శన ఎలా ఉంది? అనేవి తెలుసుకుందాం.
అండర్-19 టోర్నమెంట్ 1988లో ప్రారంభమైంది. ఇప్పటివరకు 14 ఎడిషన్లు జరిగాయి. ఇందులో 7 జట్లు విజేతలుగా నిలిచాయి. అండర్- 19 చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు టీమ్ఇండియానే కావడం విశేషం. 2000, 2008, 2012, 2018, 2022లో విజేతగా నిలిచింది. 3 సార్లు రన్నరప్ హోదాతో సరిపెట్టుకుంది. అంతేకాదు యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లి లాంటి స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నీనుంచే వెలుగులోకి వచ్చారు. ఇలాంటి అద్భుతమైన టోర్నీలో మన జట్టుకు చెందిన టాప్- 5 మూమెంట్స్ ఏంటంటే?
2000లో తొలి విజయం: 2000 సంవత్సరంలో టీమ్ఇండియా తొలిసారి అండర్-19 ట్రోఫీని ముద్దాడింది. ఫైనల్లో శ్రీలంకతో తలపడ్డ భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అప్పటి టీమ్ఇండియాకు మహమ్మద్ కైఫ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అదే టోర్నీ అప్పటి టీమ్ఇండియాకు యువరాజ్ సింగ్‌ను అందించింది. ఆ టోర్నీలో యువీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకొని 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' గా ఎంపికయ్యాడు. ఇక కెప్టెన్ కైఫ్ తర్వాతి కాలంలో వరల్డ్ క్రికెట్లో కైఫ్ బెస్ట్ ఫీల్డర్‌గా పేరు తెచ్చుకున్నాడు.
కింగ్ కోహ్లి ఎంట్రీతో: 2008 వరల్డ్‌కప్ ఎడిషన్ సంచలన ఆటగాడు విరాట్ కోహ్లీని ప్రపంచానికి పరిచయం చేసింది. మలేసియాలో జరిగిన ఆ టోర్నీలో టీమ్ఇండియాకు విరాట్ నాయకత్వం వహించాడు. ఫైనల్లో సౌతాఫ్రికాతో తలపడ్డ భారత్ విజయం సాధించింది. వర్షం కారణంగా 25 ఓవర్లలో 116 పరుగులకే లక్ష్యాన్ని కుదించారు. కానీ టీమ్ఇండియా 103 పరుగులకే దక్షిణాఫ్రికాను చిత్తు చేసి రెండోసారి కప్పును సొంతం చేసుకుంది.