Team India Test Records In Vizag : ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 2నుంచి వైజాగ్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇక్కడి మైదానంలో మన జట్టు ఆటగాళ్లు ఇప్పటివరకు సాధించిన పలు టెస్టు రికార్డులపై ఓ లుక్కేద్దాం.
వివరాళ్లోకి వెళితే :వైజాగ్ స్టేడియం టీమ్ఇండియాకు కలిసొచ్చిందని చెప్పవచ్చు. వైజాగ్ స్టేడియంలో టీమ్ఇండియా ఇప్పటివరకు ఆడిన రెండు టెస్టుల్లోనూ ఘన విజయం సాధించింది. 2016లో తొలిసారి ఇంగ్లాండ్‌ను 246 పరుగుల భారీ తేడాతో చిత్తుచేసిన భారత్, 2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులోనూ 209 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఇక దాదాపు 5 ఏళ్ల తర్వాత మళ్లీ విశాఖపట్నం వేదికగా మరోసారి టెస్టు పోరులో ఇంగ్లిష్ జట్టుతో తలపడేందుకు సిద్ధమైంది భారత్. ముచ్చటగా మూడోసారి కూడా ఈ మైదానంలో తన హిస్టరీని భారత్ రిపీట్ చేయాలని కోరుకుంటున్నారు క్రికెట్ అభిమానులు.
పరుగులతో విరాట్-వికెట్లతో అశ్విన్! ఇప్పటివరకు ఆడిన రెండు టెస్టుల్లోనూ మన ఆటగాళ్లు సత్తా చాటి జట్టుకు విజయాన్ని అందించారు. అయితే తొలి టెస్టు ఇంగ్లాండ్‌తోనే ఆడి గెలవటం విశేషం. ఈ టెస్ట్ మ్యాచ్‌కు కింగ్ విరాట్ కోహ్లి సారథ్య బాధ్యతలు వహించి, 167 పరుగులతో చెలరేగాడు. అశ్విన్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లతో ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.
హిట్‌మ్యాన్ డబుల్ సెంచరీ!
2019లో వైజాగ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లోనూ టీమ్ఇండియా 209 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ రెండు ఇన్నింగ్స్‌లలో తలో సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 176 (244 బంతుల్లో 23 ఫోర్లు, 6 సిక్సర్లు), రెండో ఇన్నింగ్స్‌లో 127 (149 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లు) పరుగులు చేసి బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. దీంతో విశాఖపట్నం మైదానంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. ఇక ఇదే మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఏడు వికెట్లు పడగొట్టాడు.