Cantract Employees in Telangana : కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం చట్టంలో అమెండ్మెంట్ ద్వారా చేర్చిన సెక్షన్ 10ఏ రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది. దీనికోసం జారీ చేసిన జీవో నంబర్ 16 చెల్లదంటూ సంచలన తీర్పు వెలువరించింది. అయితే జీవో 38 కింద ఇప్పటికే రెగ్యులరైజేషన్ పూర్తయిన ఉద్యోగులను కొనసాగించాలని, వారిని తొలగించరాదని తీర్పులో స్పష్టంగా పేర్కొంది.
భవిష్యత్తులో ఎలాంటి క్రమబద్ధీకరణ నియామకాలు చేపట్టరాదని స్పష్టం చేసింది. ఒప్పంద ప్రాతిపదికన కొనసాగుతున్న జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఇందుకోసం జీవో 16 ద్వారా తీసుకువచ్చిన సెక్షన్ 10ఏను సవాల్ చేస్తూ పలువురు పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి మంగళవారం (నవంబర్ 19)న తీర్పు వెలువరించింది.
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం : కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రభుత్వ విధానాలకు పూర్తిగా విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. చట్టం దృష్టిలో ఇది సరికాదని తేల్చి చెప్పింది. చట్టబద్ధమైన ఎడ్యుకేషన్ సర్వీసు నిబంధనలను సెక్షన్ 10ఏ అతిక్రమించడం సరైనది కాదని పేర్కొంది. ఎడ్యుకేషన్ సర్వీసు నిబంధనలు, సెక్షన్ 10ఏ ద్వారా తీసుకొచ్చిన నిబంధనలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయంది. ప్రభుత్వ ఉద్యోగ సర్వీసులకు రెండు వేర్వేరు నిబంధనల కింద భిన్నమైన అర్హతలు పెట్టడం సరికాదంది. ప్రస్తుత క్రమబద్ధీకరణకు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదని, పారదర్శకంగా లేని అర్హతలు నిర్ణయించారని, అందువల్ల క్రమబద్ధీకరణ అధికారం చట్టానికి అనుగుణంగా ఉందని భావించలేమని స్పష్టం చేసింది.
పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధం : సెక్షన్ 10ఏను పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 101 కింద లభించిన అధికారంతో తీసుకువచ్చామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ధర్మాసనం పూర్తిగా విభేదించింది. సెక్షన్ 101 కింద ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టాలను రద్దు చేయడం, సవరించడం, మార్పుతో స్వీకరించడం చేయవచ్చని పేర్కొంది. అయితే అమల్లోని చట్టానికి సెక్షన్ 10ఏను చేర్చడం సరికాదని పేర్కొంది. ఎడ్యుకేషన్ సర్వీసు నిబంధనల రద్దు, సవరణలు జరగకుండా సెక్షన్ 10ఏతో కొత్త రూల్స్ తీసుకురావడం, సరికొత్త అర్హతలను పెట్టడం సరికాదంది.
సాంకేతిక కారణాలతో తిరస్కరించలేం : కాంట్రక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టివేశాయని, అందువల్ల తేల్చిన అంశంపై తిరిగి విచారణ చేపట్టరాదన్న ప్రతివాదుల వాదనతో ధర్మాసనం విభేదించింది. అందులో కేసు పూర్వాపరాల్లోకే కోర్టులు వెళ్లలేదని, కాంట్రాక్ట్ కింద నియమితులైనవారిని ప్రతివాదులుగా చేర్చలేదని, అందువల్ల గతంలో తేల్చిన అంశంగా చూడవద్దని తెలిపింది.
చట్టానికి సవరణ చేసి కొత్తగా చేర్చిన సెక్షన్ 10ఏ రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ ప్రస్తుతం పలు పిటిషన్‌లు దాఖలయ్యాయని పేర్కొంది. ప్రభావితులయ్యే వారందరినీ ప్రతివాదులుగా చేర్చాల్సిన అవసరంలేదని ఎ.వి.ఆర్.సిద్ధాంతి కేసులో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని పేర్కొంది. సాంకేతిక కారణాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత పిటిషన్‌లను తోసిపుచ్చజాలమని పేర్కొంది.
ఉన్నవారిని తొలగించాలని ఆదేశించలేం : ప్రస్తుతం రాష్ట్రంలో 5,544 మంది కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యూలర్ అయ్యారని వారిని తొలగించలేమని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుత కేసుల ప్రకారం క్రమబద్ధీకరణ జరిగిన వారిని మాత్రమే తొలగించి పిటిషనర్లతో నియమించాలని ఆదేశాలివ్వాల్సి ఉందని, అయితే వాళ్లను తొలగించాలని ఏ ఒక్క పిటిషన్‌లోనూ ఎవరూ కోరలేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
చట్టవిరుద్ధమైన నియామకాలు జరిగినప్పుడు నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలంటూ ఎం.ఎ.హమీద్ వర్సెస్ ఏపీ కేసులో సుప్రీంకోర్టు పేర్కొందని, ఇక్కడ క్రమబద్ధీకరణ జరిగిన ఉద్యోగులు 2009లో నియమితులయ్యారని, దాదాపు 15 ఏళ్లకుపైగా సర్వీసులో సేవలందించారని తెలిపింది. ఈ దశలో తొలగిస్తే ఆ ఉద్యోగులకు నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. రాజ్యాంగంలోని అధికరణ 226 కింద హైకోర్టు విచక్షణాధికారంతో విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవచ్చని, ఈ నేపథ్యంలో ఇప్పటికే క్రమబద్ధీకరణ జరిగిన ఉద్యోగులను తొలగించరాదని ఆదేశించింది. భవిష్యత్తులో చట్టప్రకారం నియామకాలు చేపట్టాలంటూ 40 పేజీలతో కూడిన తీర్పులో పేర్కొంది.
రామ్‌గోపాల్ వర్మకు షాక్ - ఆ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు
ఇంటి భోజనం - ప్రత్యేక బ్యారక్ - పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట