Champions Trophy 2025 : 2025 ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేలా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)ను ఒప్పించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కృషి చేస్తోంది. అధికారికంగా కాకుండా తెరవెనుక ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. భద్రతా కారణాలు వల్ల పాక్‌లో అడుగుపెట్టమని టీమ్ ఇండియా చెబుతుండటంతో ఐసీసీ పాక్‌ను ఒప్పించే పనిలో పడింది.
టోర్నమెంట్ సజావుగా సాగేందుకు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్‌ను ఒప్పించేందుకు ఐసీసీ పని చేస్తోంది. ప్రతిపాదిత హైబ్రిడ్ మోడల్లో భాగంగా పాకిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో టోర్నీ నిర్వహించేందుకు ప్రయత్నిస్తోంది. టీమ్ ఇండియా పాల్గొనే మ్యాచ్‌లను యూఏఈలో షెడ్యూల్ చేసే ప్లాన్‌లో ఉంది.
ఓ పక్క ఐసీసీ ప్రయత్నిస్తున్నా, మరోపక్క పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తన వైఖరిపై గట్టిగానే ఉన్నారు. మొత్తం టోర్నమెంట్ పాకిస్థాన్‌లోనే జరగాలని, హైబ్రిడ్ మోడల్‌కు అవకాశం లేదని తేల్చి చెప్పారు. మరింత ఆలస్యం చేయకుండా అధికారిక షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేయాలని కూడా కోరారు.
షెడ్యూల్ ఖరారు చేయడంలో జాప్యం - టోర్నమెంట్ షెడ్యూల్ మొదట నవంబర్ 12న రిలీజ్ చేస్తారని భావించారు. ఆ తర్వాత నవంబర్ 19కి వాయిదా వేశారు. ఇప్పటికీ బీసీసీఐ, పీసీబీ మధ్య విభేదాలు పరిష్కారం కాలేదు. సొంతంగా టోర్నీ నిర్వహించాలని పీసీబీ, పాక్‌లో అయితే అడుగు పెట్టమని బీసీసీఐ తేల్చి చెబుతున్నాయి.
పాకిస్థాన్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ ఎందుకు కీలకం?
2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడం పాకిస్థాన్‌కు చాలా కీలకం. ఈవెంట్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది. హైబ్రిడ్ మోడల్‌ను అమలు చేస్తే భారీ నష్టాలు వస్తాయని భయపడుతోంది. టోర్నమెంట్‌ను పూర్తిగా పాకిస్థాన్‌లో నిర్వహించడం వల్ల ఈ పెట్టుబడులను తిరిగి పొందవచ్చని అనుకుంటోంది. అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్‌లను నిర్వహించడంలో తన సత్తా నిరూపించుకోవాలని కూడా భావిస్తోంది.
ఈ వివాదాల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడం అంత సులువు కాదు. రాజీ కుదురుతుందా? లేక హోస్టింగ్ వివాదం మరింత ముదురుతుందా? తెలియాలంటే మరికొంత కాలం వేచి ఉండాలి. ఇప్పటికే బీసీసీఐ తమ నిర్ణయాన్ని ఐసీసీకి తెలియజేసింది. హైబ్రిడ్ మోడల్‌లో యూఏఈలో మ్యాచ్‌లు ఆడేందుకు బీసీసీఐ అంగీకారం తెలిపినట్లు సమాచారం.