Gambhir On Ricky Ponting :బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో పాల్గొనేందుకు భారత జట్టు ఆదివారం ఆస్ట్రేలియా బయల్దేరింది. ఆస్ట్రేలియాతో భారత్ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. నవంబర్ 22న తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సోమవారం ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఇటీవల విరాట్ కోహ్లీ ఫామ్‌పై కామెంట్స్ చేసిన ఆసీస్ మాజీ ప్లేయర్ రికీ పాంటింగ్‌కు గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
'గత ఐదేళ్లలో విరాట్ కోహ్లీ టెస్టుల్లో మూడు సెంచరీలే బాదాడు. అతడి ఫామ్‌పై నేను ఆందోళన చెందుతున్నా' అని ఇటీవల ఐసీసీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు. అయితే దీనికి గంభీర్ తాజా ప్రెస్మీట్లో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్‌పై తనకు ఎలాంటి ఆందోళన లేదని స్పష్టం చేశాడు. భారత క్రికెట్‌తో పాంటింగ్‌కు సంబంధం లేదని అన్నాడు.
'భారత క్రికెట్‌తో రికీ పాంటింగ్‌కు ఏం సంబంధం? అతడు ఆస్ట్రేలియా క్రికెట్ గురించి ఆలోచిస్తే మంచిది. నాకు విరాట్, రోహిత్ ఫామ్‌పై ఎలాంటి ఆందోళన లేదు. వాళ్లిద్దరు చాలా సాధించారు. ఇండియన్ క్రికెట్‌కు ఎంతో సేవ చేశారు. ఇప్పటికీ వాళ్లలో పరుగుల దాహం ఉంది. అందుకు చాలా కష్టపడుతున్నారు కూడా' అని గంభీర్ అన్నాడు.