Rohit Sharma Srilanka Series:2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసమే శ్రీలంకతో వన్డే సిరీస్‌కు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీని టీమ్ఇండియా హెచ్ కోచ్ గంభీర్ తీసుకొచ్చాడని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ మ్యాచ్‌లు వీరిద్దరికి ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రాక్టీస్‌గా పనికొస్తాయని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ ప్రచారంపై టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు. ఇంతకీ హిట్‌మ్యాన్ ఏమన్నాడంటే?
'క్రికెట్ నాణ్యతపై రాజీపడబోం'
శ్రీలంకతో వన్డే సిరీస్‌ను వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రాక్టీస్ గా పరిగణించట్లేదని రోహిత్ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నాణ్యతపై రాజీపడబోమని మీడియా సమావేశంలో తెలిపాడు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు క్రికెట్ నాణ్యత దెబ్బతినకూడదని చెప్పాడు. గత కొన్నేళ్లుగా క్రికెట్ ఆడుతున్నామని, ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ గెలవాలనుకుంటామని పేర్కొన్నాడు.
ప్రాక్టీస్ మ్యాచ్‌లు కాదు- ఇంటర్నేషనల్ గేమ్స్
'ప్రపంచకప్ ముందు మ్యాచ్‌లు ఆడితే వరల్డ్‌కప్‌నకు సన్నాహాలు? వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ వస్తోంది. ఇప్పుడు ఆడితే దీనికి సన్నద్దమవడం? ఇలాంటి ప్రశ్నలు తరచుగా వినిపిస్తుంటాయి. శ్రీలంకతో జరిగేవి ప్రాక్టీస్ మ్యాచులు కాదు. ఇంటర్నేషన్ గేమ్స్. మేము జట్టుగా ఏమి సాధించాలనుకుంటున్నామో అది మా మనసులో ఉంచుకుంటాం. మేమంతా శ్రీలంక వచ్చి మంచి క్రికెట్ ఆడి సిరీస్ గెలవాలనుకుంటున్నాం' అని రోహిత్ వ్యాఖ్యానించాడు.