తెలంగాణ

telangana

ETV Bharat / sports

హోరాహోరీగా టీ20 వరల్డ్‌ కప్ - బ్యాట్‌ను ఓడిస్తున్న బాల్‌! - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024

T20 WORLD CUP 2024 PITCH : టీ20 వరల్డ్‌ కప్‌లో 24 మ్యాచ్‌లు ముగిశాయి. ఒక్కసారే 200 స్కోరు నమోదైంది. ఒక్కరూ సెంచరీ కూడా కొట్టలేదు. అయినా క్రికెట్‌ ఫ్యాన్స్‌ బెస్ట్‌ క్రికెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్ పొందుతున్నారు. పూర్తి వివరాలు స్టోరీలో.

source ANI
pitch (source ANI)

By ETV Bharat Telugu Team

Published : Jun 12, 2024, 8:00 PM IST

T20 WORLD CUP 2024 PITCH : రెగ్యులర్‌ టీ20 మ్యాచ్‌లకు, ప్రస్తుత టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టోర్నీ గేమ్‌లకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 2024 తరహాలో రికార్డు బ్రేకింగ్‌ స్కోర్‌లు లేవు, మెరుపు సెంచరీలు నమోదు కావడం లేదు. యూఎస్‌ఏలోని డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లపై పరుగులు రావడం లేదు. దాదాపు అన్ని మ్యాచుల్లో తక్కువ స్కోర్‌లు నమోదయ్యాయి. బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుంటే, బౌలర్లు వికెట్ల పండగ చేసుకుంటున్నారు. టీ20 ఫార్మాట్‌ అనగానే అందరికీ బ్యాటర్ల ఆధిపత్యం, ధనాధన్‌ బ్యాటింగ్‌ గుర్తొస్తుంది. కానీ టీ20 వరల్డ్‌ కప్‌లో బౌలర్ల హవా కొనసాగుతోంది.

  • హోరాహోరీగా జరుగుతున్న మ్యాచ్‌లు
    టీ20 వరల్డ్‌ కప్‌లో తక్కువ స్కోర్లు నమోదవుతున్నా, పోటీ హోరాహోరీగా సాగుతోంది. ఫ్యాన్స్‌ చివరి వరకు గేమ్‌ను ఆసక్తిగా చూస్తున్నారు. డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లపై జరుగుతున్న మ్యాచ్‌లు భిన్నమైన ఫలితాలను ఇస్తున్నాయి. సగం టోర్నీ అయినా పూర్తికాక ముందే రెండు మ్యాచ్‌లు సూపర్‌ ఓవర్‌కి వెళ్లాయి. దీన్ని బట్టి టోర్నీ ఎంత ఉత్కంఠగా సాగుతుందో అంచనా వేయవచ్చు.

ముఖ్యంగా ఇటీవల జరిగిన పాకిస్థాన్‌, ఇండియా మ్యాచ్‌ టోర్నీకే హైలైట్‌గా చెప్పవచ్చు. దాదాపు ఓటమి తప్పదనుకున్న పరిస్థితుల నుంచి టీమ్‌ ఇండియా గెలిచిన తీరును ఫ్యాన్స్‌ తెగ ఎంజాయ్‌ చేశారు. అలానే దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ కూడా బెస్ట్‌ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. తక్కువ టార్గెట్స్‌ను భారత్‌, దక్షిణాఫ్రికా కాపాడుకున్న తీరు ఆకట్టుకుంది.

  • బ్యాటర్లకు సవాలు
    టీ20 వరల్డ్‌ కప్‌లో ఇప్పటి వరకు ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు. యూఎస్‌ బ్యాటర్‌ ఆరోన్‌ జోన్స్‌ మాత్రమే 94 పరుగులతో సెంచరీకి దగ్గరగా వచ్చాడు. ఆఫ్ఘానిస్థాన్‌ బ్యాటర్‌ గుర్బాజ్‌ రెండు హాఫ్‌ సెంచరీలతో టాప్‌ పొజిషన్‌లో ఉన్నాడు. దీన్ని బట్టి బ్యాటర్లు పరుగులు చేయడానికి ఎంత కష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఒక్క ఆస్ట్రేలియా మాత్రమే 200 పరుగుల మార్కు అందుకోగలిగింది.
  • బౌలర్లదే పైచేయి
    ఆఫ్ఘానిస్థాన్‌ బౌలర్‌ ఫరూకి 2 మ్యాచుల్లో ఏకంగా 9 వికెట్లు పడగొట్టాడు. రెండో స్థానంలో దక్షిఫ్రికా పేసర్‌ నోకియా ఉన్నాడు, అతను 3 మ్యాచుల్లో 8 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్‌ జంపా కూడా 3 మ్యాచుల్లో 8 వికెట్లు సాధించాడు. తర్వాత విండీస్‌ కుర్రాడు అకీల్‌ హోసిన్‌, అఫ్గాన్‌ స్టార్‌ రషీద్‌ఖాన్ ఆరేసి వికెట్లతో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. టాప్‌ ఫైవ్‌లో ముగ్గురు స్పిన్నర్లు ఉండటం గమనార్హం.
  • చిన్న టీమ్‌ల గట్టి పోటీ
    సాధారణంగా అయితే చిన్న టీమ్‌లపై స్టార్‌ బ్యాటర్లు పరుగుల వరద పారించేవారు. అత్యధిక స్కోర్‌లు నమోదయ్యేవి. కానీ యూఎస్‌ఏలో మ్యాచ్‌లు చిన్న టీమ్‌లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం అందించాయి. అందుకే పాకిస్థాన్‌పై యూఎస్‌ఏ, న్యూజిలాండ్‌పై ఆఫ్ఘానిస్థాన్‌ అందుకున్న విజయాలే ఉదాహరణ. ఎంత భారీ హిట్టర్లు ఉన్నా తెలివిగా ఆడకపోతే, చిన్న టీమ్‌లు షాక్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుత టీ20 వరల్డ్‌ కప్‌లో ఏ టీమ్‌తో అయినా పోరాడి గెలవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చాలా తక్కువ మ్యాచ్‌లే తక్కువ సమయంలో, ఏకపక్షంగా ముగిశాయి. ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు జరిగితే 10 మ్యాచ్‌ల్లో బాల్‌ కీలకపాత్ర పోషించింది.

ABOUT THE AUTHOR

...view details