T20 Worldcup 2024 Afghanistan : ఈ ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ ఆటను వర్ణించానికి మాటల్లేవ్. ఇంతటి పోరాట తత్వం, ఇంత కసి వారిలో ఎవరు నింపారో అని క్రికెట్ ప్రపంచమంతా విస్తుపోతోంది. సరైన వసతులు, వనరులు లేకున్నా, ప్రతిభ, పట్టుదల, పోరాటమే ఆయుధాలుగా వారు ఎదిగిన తీరు, సాధిస్తున్న విజయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
నిజానికి నిన్న మొన్నటి వరకు అఫ్గాన్‌ను పసికూన అనేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ ట్యాగ్ చెరిగిపోయింది. ఇప్పుడు ఏ పెద్ద జట్టు కూడా ఆ జట్టును తక్కువ అంచనా వేయడం లేదు. ఎందుకంటే ఆ జట్టే ఇప్పుడు ఇంగ్లాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి జట్లపై విజయాలు సాధించింది. ఈ ప్రపంచకప్‌లో కివీస్‌ను ఏకంగా 84 పరుగుల తేడాతో ఓడించి ఆ జట్టు గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసింది. సూపర్-8లో ఆస్ట్రేలియానే 21 పరుగుల తేడాతో ఓడించి ఆ టీమ్ ఇంటిముఖం పట్టేలా చేసింది.
అయితే అఫ్గానిస్థాన్ విజయాలను ఆ దేశంలోనే కాదు మన దేశంలోనూ ఆస్వాదిస్తున్నారు! ఎందుకంటే ప్రపంచ క్రికెట్‌లో అఫ్గాన్ ఎదుగుదలలో భారత్ పాత్ర ఎంతో కీలకమనే చెప్పాలి. ఆ జట్టుకు స్టేడియాలు, ప్రాక్టీస్ సౌకర్యాలు అందించింది. అలానే కొన్ని సిరీస్‌లకు ఇక్కడి నుంచే ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని కల్పించింది.
భారత మాజీ క్రికెటర్లు కూడా వారికి కోచింగ్ ఇచ్చారు. మనోజ్ ప్రభాకర్, లాల్‌చంద్ రాజ్‌పుత్, అజయ్ జడేజాలు గతంలో ఆఫ్గానిస్థాన్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. వన్డే ప్రపంచకప్-2023 వరకు జడేజా ఆ జట్టు మెంటర్‌గా ఉన్నాడు.