తెలంగాణ

telangana

బంగ్లాదేశ్​ మ్యాచ్​లో అఫ్గానిస్థాన్​ చీటింగ్​! - మాజీల విమర్శలు - T20 Worldcup 2024

By ETV Bharat Telugu Team

Published : Jun 25, 2024, 1:53 PM IST

T20 Worldcup 2024 Afghanistan : టీ20 వరల్డ్​కప్​ సూపర్‌ ఎయిట్​లో బంగ్లాదేశ్​పై విజయం సాధించిన అఫ్గానిస్థాన్​ జట్టు తొలిసారి సెమీస్​లో అడుగు పెట్టింది, అయితే ఈ గెలుపు కోసం అప్గాన్ జట్టు మైదానంలో డ్రామాలు ఆడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు స్టోరీలో.

source The Associated Press
GULBADIN NAIB (source The Associated Press)

T20 Worldcup 2024 Afghanistan Gulbadin Naib:టీ20 ప్రపంచకప్‌ 2024 సూపర్‌ ఎయిట్‌లో బంగ్లాదేశ్‌ - అఫ్గానిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. మధ్య మధ్యలో వర్షం అంతరాయం కలిగిస్తున్నా గెలుపు కోసం ఇరు జట్లు చివరి వరకూ పోరాడడంతో మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. కానీ చివరికి అప్గాన్‌ అద్భుతం విజయం సాధించి సెమీస్‌ చేరింది. అయితే ఈ పోరులో అప్గాన్ జట్టు మైదానంలోనే కొన్ని డ్రామాలు ఆడిందన్న విమర్శలు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. చీటింగ్ చేసిందంటూ అంతా ఆరోపిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే - ఈ మ్యాచ్‌లో గెలుపొందేందుకు అఫ్గానిస్థాన్‌ ఎంతకైనా తెగించేలా కనిపించింది! మొదట బ్యాటింగ్​కు దిగిన అఫ్గానిస్థాన్ బంగ్లాదేశ్ ముందు 116 పరుగుల లక్ష్యం ఉంచింది. వ‌ర్షం అంతరాయం కలిగిస్తున్నప్పటికీ బంగ్లా మంచి శుభారంభమే చేసింది. కానీ ఆ తర్వాత రషీద్ ఖాన్ తన స్పిన్ మాయాజాలంతో మ్యాచ్​ను ఆఫ్గాన్​ వైపు తిప్పాడు. అయితే ఛేదనలో లిటన్ దాస్ తన బ్యాటింగ్​తో ఆఫ్గానిస్థాన్​కు కాస్త టెన్ష‌న్ పెట్టాడు. దీంతో వర్షం మాత్రమే అఫ్గానిస్థాన్​ను తిరిగి మ్యాచ్ విన్నింగ్ ట్రాక్​లోకి తీసుకురాగలదని గ్ర‌హించిన ఆ జ‌ట్టు కోచ్ జోనాథన్ ట్రాట్ మ్యాచ్ నెమ్మదించాలని ఆటగాళ్లకు సైలెంట్​గా సంకేతాలు ఇచ్చాడు.

దీన్ని ఫాలో అయిన గుల్బాదిన్ నైబ్ మైదానంలో అకస్మాతుగా కింద పడిపోయాడు. తాను గాయపడినట్లు నటించడం ప్రారంభించాడు. కానీ కొంత సేపు తర్వాత వేగంగా బౌలింగ్ చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్​గా మారింది. దీంతో మ్యాచ్​లో అఫ్గానిస్థాన్‌ మోసం చేసిందంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అఫ్గాన్ కోచ్‌ జోనాథన్ ట్రాట్ సూచనల మేరకు ఆ జట్టు పేసర్‌ గుల్బదీన్‌ తొడ కండరాలు పట్టేసినట్లు నటించాడని నెటిజన్లు, క్రికెట్ ప్రియులు ఆరోపిస్తున్నారు. గుల్బాదిన్ చేసిన డ్రామా ఆస్కార్ ఫెర్ఫామెన్స్​కు మించి ఉందని సెటైర్లు వేస్తున్నారు. ఫాస్ట్ బౌలర్ చేసిన‌ ఈ హై డ్రామా అఫ్గాన్​ను మొదటిసారి సెమీఫైనల్‌కు తీసుకెళ్లడంలో ముఖ్య పాత్ర పోషించిందని అంటున్నారు. అయితే గుల్బదిన్‌ చర్యతో బంగ్లాదేశ్ జట్టు మాత్రమే కాకుండా అఫ్గానిస్థాన్​ కెప్టెన్ రషీద్ ఖాన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

మాజీ క్రికెటర్లు సెటైర్లు -గుల్బదిన్ చర్యపై టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్ వాన్ సరదాగా స్పందించారు. గుల్బదీన్‌కు రెడ్‌ కార్డ్‌ ఇవ్వాలంటూ అశ్విన్‌ సరదగా పోస్ట్ చేశాడు. గాయమైన తర్వాత కూడా వికెట్లు తీసుకున్నాడని గుల్బదిన్‌ గాయంపైన అశ్విన్‌ సెటైర్ వేశాడు. గుల్బదీన్‌ గాయమైన 25 నిమిషాలకే మళ్లీ మైదానంలోకి దిగి బౌలింగ్‌ చేసి వికెట్ తీసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడని వాన్‌ ట్వీట్ చేశాడు. స్లిప్‌లో ఉన్నట్టుండి కిందపడిపొమ్మని కోచ్‌ సందేశం పంపాడని, దానిని గుల్బదీన్ పాటించాడని కామెంట్రీ చెబుతున్న సైమన్‌ డౌల్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. తనకు ఆరు నెలలుగా మోకాలి నొప్పి ఉందని గుల్బదిన్‌కు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ ఎవరో చెబితే తాను కూడా అక్కడే వైద్యం చేయించుకుంటానంటూ మరో కామెంటేటర్ ఇయాన్ స్మిత్ కూడా వ్యాఖ్యానించాడు.

ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్​పై విజయం - సెమీస్​కు చేరిన అఫ్గానిస్థాన్​ - T20 Worldcup 2024

పంత్​ను బూతులు తిట్టిన కెప్టెన్ రోహిత్​ - ఈ వైరల్ వీడియో చూశారా? - T20Worldcup 2024

ABOUT THE AUTHOR

...view details