Virat Kohli VS Pakisthan : టీమ్ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తన కెరీర్లో ఎన్నో మైలురాళ్లు, అవార్డులు సొంతం చేసుకున్నప్పటికీ, 2022 అక్టోబరు 23న పాకిస్థాన్‌పై ఆడిన ఇన్సింగ్స్ ఎంతో స్పెషల్. రెండేళ్ల క్రితం ఇదే రోజున టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ తన ప్రదర్శనతో కోట్లాది మంది అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న టీమ్ఇండియాకు వీరోచిత ఇన్సింగ్స్‌తో విజయాన్ని అందించాడు. కేవలం 53 బంతుల్లోనే 82 పరుగులు బాదాడు. దీంతో భారత్ తన ప్రత్యర్థి దాయాది దేశంపై చిరస్మరణీయ విజయం సాధించింది.
భారత్‌కు 160 పరుగుల లక్ష్యం -మెల్బోర్న్ వేదికగా 2022 అక్టోబరు 23న పాకిస్థాన్, భారత్ మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన పాక్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. పాకిస్థాన్ బ్యాటర్లలో షాన్ మసూద్ (52 నాటౌట్; 42 బంతుల్లో 5×4), ఇఫ్తికార్ అహ్మద్ (51; 34 బంతుల్లో 2×4, 4×6) రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో అర్ష్‌దీప్ (3/32), హార్దిక్ పాండ్య (3/30) రాణించారు.
ఆదిలోనే ఎదురుదెబ్బ -160 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పవర్‌ప్లేలోనే టాప్ ఆర్డర్ కుప్ప కూలిపోయింది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ తక్కువ పరుగులకే పెవిలియన్ బాటపట్టారు. దీంతో టీమ్ఇండియా 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అప్పటికే పాకిస్థాన్ పేసర్లు షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్ టీమ్ఇండియా బ్యాటర్లుపై నిప్పులు చెరుగుతున్నారు. దీంతో భారత బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. స్కోరు వేగం మరింత నెమ్మదించింది. భీకరంగా సాగుతున్న పాక్ బౌలింగ్‌ను ఎదుర్కొని చివరి 10 ఓవర్లలో 115 పరుగులు చేయడం అసాధ్యమే అనిపించింది.
కోహ్లీ విరోచిత ఇన్నింగ్స్ -ఆ తర్వాత హార్దిక్ పాండ్య, విరాట్ కోహ్లీ కలిసి టీమ్ఇండియా స్కోరును పరుగులు పెట్టించడం మొదలుపెట్టారు. అయితే టీమ్ఇండియా విజయం కోసం చివరి 3 ఓవర్లలో 48 పరుగులు చేయాలి. ఈ దశలో షహీన్‌ను బౌలింగ్‌కు దింపి బాబర్ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయగా, కోహ్లీ ఖాళీలు చూసి అద్భుతమైన షాట్లతో మూడు బౌండరీలు బాదాడు. దీంతో 18వ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. ఇంకా రెండు ఓవర్లలో భారత్ విజయానికి 31 పరుగులు కావాలి.
ఆఖరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు -కానీ 19వ ఓవర్లో రవూఫ్ కట్టిపడేశాడు. తొలి 4 బంతుల్లో మూడే పరుగులు ఇచ్చాడు. 8 బంతుల్లో 28 పరుగులు చేయాల్సి రావడం వల్ల మ్యాచ్ పై భారత అభిమానులు దాదాపుగా ఆశలు వదిలేసుకున్నారు. కానీ అనూహ్యం కోహ్లీ చివరి రెండు బంతులకు నమ్మశక్యం కాని షాట్లతో సిక్సర్లు బాదేశాడు. దీంతో చివరి ఓవర్ లక్ష్యం 16 పరుగులు.