Team India Return: టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన టీమ్ఇండియా 3 రోజుల తర్వాత స్వదేశం చేరుకుంది. ఈనెల 29న జరిగిన ఫైనల్ పోరులో సౌతాఫ్రికాపై అద్భుత విజయం నమోదు చేసిన రోహిత్ సేన గురువారం ఉదయం దిల్లీ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంది. వరల్డ్ ఛాంపియన్లకు బీసీసీఐ అధికారులు, టీమ్ఇండియా ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జైషా, మీడియా కూడా అదే విమానంలో స్వదేశం చేరుకున్నారు. ప్లేయర్ల రాకతో దిల్లీ ఎయిర్ పోర్ట్ ఫ్యాన్స్‌తో కిక్కిరిసిపోయింది. 'భారత్ మాతా కీ జై', 'ఇండియా ఇండియా' నినాదాలతో అభిమానులు హోరెత్తించారు.
ఇక బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో ప్లేయర్లంతా దిల్లీ ఐటీసీ మౌర్య హోటల్‌కు వెళ్లారు. అక్కడ హోటల్ సిబ్బంది ప్లేయర్లకు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. చాక్లెట్ ఫ్లేవర్‌తో వరల్డ్‌కప్ ట్రోఫీ డిజైన్‌లో ప్రత్యేకంగా కేక్ తయారు చేశారు. ఆటగాళ్లకు స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్ కూడా రెడీ చేసినట్లు హోటల్ చీఫ్ చెఫ్ చెప్పారు. కాగా, ఇక్కడ నుంచి రోహిత్ సేన ప్రధాని మోదీని కలిసేందుకు వెళ్లనుంది. ఉదయం 11 గంటలకు ఆయన నివాసంలో మర్వాదపూర్వకంగా కలవనున్నారు. ఆ తర్వాత భారత క్రికెట్ జట్టు సభ్యులు స్పెషల్ ఫ్లైట్‌లో ముంబయికి బయల్దేరుతారు.