T20 World Cup 2024 Pakisthan Coach :పాకిస్థాన్ వైట్ బాల్ కోచ్‌గా ఉన్న గ్యారీ కిరస్టన్ ముందు మరో సవాల్ నిలిచింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు టీ20 వరల్డ్ కప్ 2024లో తమ జట్టు బాధ్యతలను అతడికి అప్పగించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో గ్యారీ మెంటార్‌గా వ్యవహరిస్తున్న గుజరాత్ టైటాన్స్ ఊహించిన దాని కన్నా మెరుగ్గా రాణించడం సహా అతడి ట్రాక్ రికార్డ్‌ను పరిశీలించి ఈ ప్రపంచకప్‌లో కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది. దీంతో ఈ వరల్డ్ కప్‌లో అతడి నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు ఎలాంటి ప్రభావం చూపిస్తుందా అనేది ప్రాధాన్యత సంతరించుకుంది.
దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ అయిన గ్యారీ కిస్టన్కు ఇండియన్ క్రికెట్ అభిమానుల్లో మంచి స్థానం ఉంది. 2008 నుంచి 2011వరకూ టీమ్ఇండియా కోసం పనిచేశాడు. 2011 వరల్డ్ కప్ సమయంలో టీమ్ఇండియాకు కోచ్‌గా వ్యవహరించాడు గ్యారీ. ఆ మెగా ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ గెలిచిన యువరాజ్ సింగ్ సైతం గ్యారీని బెస్ట్ కోచ్‌గా అభివర్ణించాడు. సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ లాంటి వాళ్లు కూడా అతని మేనేజ్మెంట్ స్కిల్స్‌పై ప్రశంసలు కురిపించారు.
ప్రస్తుతం పాకిస్థాన్ లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్ క్రికెట్ బ్యాటింగ్ కోచ్‌గానూ, జట్టుకు మెంటార్‌గానూ పనిచేస్తున్నాడు గ్యారీ. అలానే ఐపీఎల్‌లోనూ దిల్లీ డేర్ డెవిల్స్, ఆర్సీబీ, గుజరాత్ కోచ్‌గా, మెంటార్‌గా అతడికి సుదీర్ఘ అనుభవం ఉంది. ముఖ్యంగా భారత ఆటగాళ్లతో పని చేసిన అనుభవం బాగానే ఉంది. అయితే టీ20 వరల్డ్ కప్ 2024 షెడ్యూల్ ప్రకారం భారత్, పాకిస్థాన్ మధ్య జూన్ 9న మ్యాచ్ జరగనుంది. న్యూయార్క్‌లోని నాస్సౌ కౌంటీ గ్రౌండ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ జరగనుంది. దీంతో టీమ్ఇండియా ప్లేయర్ల బలాలు, బలహీనతలు తెలిసి ఉన్న అతనే పాకిస్థాన్ జట్టును వెనకనుంచి నడిపిస్తుండటంతో కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలానే ఈ ప్రపంచకప్‌లో అతడి సలహాలు, సూచనలు వల్ల పాకిస్థాన్ జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తుందా అని కూడా ఆలోచిస్తున్నారు.