T20 World Cup 2024 Rahul Dravid : టీమ్‌ఇండియా ఓటమి అనేది లేకుండా వరుస విజయాలతో టీ20 ప్రపంచ కప్పును సాధించింది. ఈ గెలుపుతో భారత్ జట్టుతో పాటు యావత్ దేశం సంబరాల్లో మునిగిపోయింది. అయితే ఈ సమయంలోనే ఎప్పడూ తన భావోద్వేగాలను బయటకు వ్యక్తపరిచే అలవాటే లేని కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా గట్టిగా అరుస్తూ ఉద్వేగానికి గురయ్యారు. కెప్టెన్‌గా సాధించలేని కప్పును కోచ్‌గా సాధించి ఓ జీవితకాల వెలితిని పూడ్చుకున్నారు అదే కరీబియన్ గడ్డపై. దాదాపు 17 ఏళ్ల తర్వాత పోగొట్టుకున్న చోటే వెతుక్కున్నట్టు సారథిగా విఫలమైనా హెడ్‌కోచ్‌గా ట్రోఫీ అందుకున్నారు. ఒకరకంగా ద్రవిడ్‌కిది చక్ దే ఇండియా మూమెంట్ అనే చెప్పాలి. గతేడాది వన్డే ప్రపంచకప్‌లోనే ద్రవిడ్‌కు ఈ మూమెంట్ రావాల్సింది. కానీ ఆటగాళ్లు, అభిమానుల మనసులు గెలిచిన ఈ ఫ్రెండ్లీ కోచ్ ఎనిమిది నెలలు ఆలస్యంగానైనా తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు.
ఉప్పొంగిన ఉద్వేగం
ఇక రాహుల్ ద్రవిడ్ భావోద్వేగాలను పెద్దగా బయటకు కనిపించేలా ఉండరు. కానీ ఆటగాడిగా దక్కని ప్రపంచకప్ ఇప్పుడు కోచ్‌గా సొంతమవడం వల్ల ద్రవిడ్ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయారు. ఫైనల్లో విజయం తర్వాత మైదానంలోకి వచ్చి ఆటగాళ్లతో పాటు సంబరాల్లో తేలిపోయారు. ఇక కప్ చేతుల్లోకి వచ్చిన వెంటనే గట్టిగా అరుస్తూ ఉద్వేగాన్ని బయటపెట్టారు.
జూనియర్ కోచ్‌గా తనదైన ముద్ర
జెంటిల్మన్ క్రికెటర్‌గా రాహుల్ ద్రవిడ్‌కు ఉన్న పేరు గురించి అందరికి తెలిసిందే. దాదాపు దశాబ్దన్నరపాటు ఆటగాడిగా టీమ్‌ఇండియాకు సేవలందించారు. రిటైరయ్యాక కూడా ఎంతో కాలం ఆటకు దూరంగా లేడు. జూనియర్ కోచ్‌గా ఎంట్రీ ఇచ్చి తనదైన ముద్ర వేశారు. భారత్ అండర్-19, భారత్-ఎ ఆటగాళ్ల నైపుణ్యాలను సానపట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మార్గనిర్దేశకంలో భారత కుర్రాళ్లు అండర్-19 ప్రపంచకప్‌ను గెలిచారు. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) అధిపతిగానూ ద్రవిడ్ పనిచేశారు. అయితే జూనియర్ జట్లకు కోచ్‌గా ఇంత పేరు తెచ్చుకున్నా, ఎప్పుడూ టీమ్‌ఇండియా కోచ్ పదవిపై ఆసక్తిని కనబరచలేదు. కానీ ద్రవిడ్ ఒకప్పటి సహచరుడైన గంగూలీ(అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు) రవిశాస్త్రి అనంతరం కోచ్‌గా ఉండేలా ద్రవిడ్‌ను ఒప్పించగలిగారు. కానీ కోచింగ్ ద్రవిడ్‌కు పూల పాన్పేమీ కాలేదు. అయినా సవాళ్లను అధిగమించారు. గతేడాది వన్డే ప్రపంచకప్ కలిగించిన నిరాశను జయించి టీమ్‌ఇండియాకు టీ20 కప్పు అందించేదాకా ఆయన విశ్రమించలేదు.