Surya Kumar Yadav ICC T20 Team : టీ20ల్లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శన ఆటగాళ్లతో కూడిన జట్టును ఐసీసీ అనౌన్స్ చేసింది. ఈ టీమ్‌కు టాప్ ర్యాంకర్ సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు పేర్కొంది. ఆసీస్, దక్షిణాఫ్రికా జట్లపై టీ20 సిరీస్‌ల్లో టీమ్ఇండియాను సూర్య అద్భుతంగా నడిపించాడు. అందుకే ఐసీసీ అతడిని సెలెక్ట్ చేసింది. అయితే ఈ జట్టులో భారత స్టార్ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు చోటు దక్కలేదు కానీ భారత్ నుంచి మరో ముగ్గురికి స్థానం లభించింది. యువ సంచలనం యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌కు జట్టులో చోటు కల్పించింది ఐసీసీ. సూర్యతో కలుపుకుని ఐసీసీ జట్టులో మొత్తంగా నలుగురు భారత ఆటగాళ్లకు చోటు లభించినట్టైంది.
యశస్వికి జోడీగా ఇంగ్లాండ్ ప్లేయర్ ఫిలిప్ సాల్ట్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేసింది ఐసీసీ. వన్‌డౌన్‌లో వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను, ఆల్‌రౌండర్లలో జింబాబ్వే ప్లేయర్ సికందర్ రాజా, ఉగాండ ఆటగాడు అల్పేష్ రంజనీని, స్పెషలిస్ట్ బౌలర్లుగా మార్క్ అడైర్ (ఐర్లాండ్), రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ (టీమ్ ఇండియా), రిచర్డ్ నగరవలను(జింబాబ్వే) ఎంపిక చేసింది. అయితే ఐసీసీ ఈ టీమ్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక, ఆఫ్గానిస్తాన్ జట్ల నుంచి ఒక్క ప్లేయర్‌ను కూడా ఎంపిక చేయలేదు.
కాగా, గతేడాది సూర్యకుమార్ యాదవ్ 18 మ్యాచుల్లో 733 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు ఉన్నాయి. ఓపెనర్‌గా వస్తున్న యశస్వి జైస్వాల్ ఆడిన 15 మ్యాచుల్లో 430 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. దూకుడైన ఆటతీరుతో అద్భుత శుభారంభం చేస్తున్నాడు. ఇక రవి బిష్ణోయ్ ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఐసీసీ ర్యాంకుల్లో దూసుకొచ్చాడు. ఎడమ చేతివాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్ గత ఏడాది 21 మ్యాచుల్లో 21 వికెట్లు తీశాడు.