NIMS Hospital Patients Facing Problems At OP : నిమ్స్‌లో ఓపీ తీసుకోవాలంటే తిప్పలు తప్పవు. నిత్యం 2500 నుంచి 3000 మంది వరకు వస్తుండటంతో ఓపీ కార్డుల కోసం నిరీక్షణ తప్పట్లేదు. గంటల తరబడి క్యూలో ఉన్నా, ఓపీ కార్డు లభించడం లేదు. కొంతమంది ముందు రోజు వచ్చి ఉదయమే ఓపీ కోసం క్యూలో నిలబడి స్లిప్పు తీసుకొని వైద్యులను సంప్రదిస్తున్నారు.
నిమ్స్‌లో ఓపీ కష్టాలు : దీంతో రోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతం నుంచి వచ్చిన రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు చూస్తున్నారు. ఓపీ సేవలను మరింత సులువు చేసేందుకు నిమ్స్‌లో కియోస్క్‌లు అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే వీటిని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. తొలుత రివ్యూ కోసం వచ్చే రోగులకే పరిమితం చేశారు. సానుకూలత రావడంతో మిగతా రోగులకూ అందుబాటులోకి తెస్తున్నారు. మిలీనియం బ్లాక్ వద్ద 2 యంత్రాలను ఈ నెల 26 నుంచి అందుబాటులోకి తేనున్నారు. టెండర్ల ప్రక్రియ నడుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో ఇది పూర్తి కానుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ తరహా కొత్త సాంకేతికత ఇదే తొలిసారి అని వైద్యులు తెలిపారు.
రోగుల నిరీక్షణ : ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో పాత భవనంతో పాటు సూపర్ స్పెషాలిటీ బ్లాకుల వద్ద ఓపీ సేవలు అందుబాటులో ఉన్నాయి. కౌంటర్ వద్దకు వెళ్లి నిర్ణీత రుసుం చెల్లించి కార్డు తీసుకొని మళ్లీ వైద్యుని కోసం వేచి చూడాలి. వైద్యుని కలిసి పరీక్షల రిపోర్టులు తీసుకొని మళ్లీ డాక్టర్‌కు చూపించే సరికే ఒక రోజు పడుతుంది. దీంతో మళ్లీ రెండో రోజు కూడా రావాల్సి వస్తుందని రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఎంతో దూరం నుంచి వచ్చిన వారు ఆసుపత్రి షెడ్డుల్లోనే గడుపుతున్నారు. మరుసటి రోజు సదరు వైద్యుడు రాకపోతే ఇంటికి వెళ్లి రెండు, మూడు రోజుల తర్వాత మళ్లీ వస్తున్నారు. దీంతో ఓపీ స్లిప్పుల కోసం కియోస్క్‌ల ఏర్పాటుతో రోగుల ఇబ్బందులు తీరుతాయని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు.
ఈ నెల నుంచి కియోస్కులు : రోగి వివరాలు, సమస్య గురించి ఎంటర్ చేసి ఆన్‌లైన్‌లో నిర్ణీత ఓపీ రుసుం చెల్లించిన తర్వాత ఒక స్లిప్పు వస్తుంది. దానిని తీసుకొని నేరుగా సంబంధిత విభాగం వద్దకు వెళ్లి వైద్యుని సంప్రదించనున్నారు. దీంతో గంటల తరబడి క్యూలో నిల్చొనే అవసరం ఉండదని తెలిపారు. కియోస్క్‌ల వినియోగంలో రోగులకు సాయం అందించేందుకు సహాయకులను నియమించనున్నారు. నిమ్స్‌లో 27పైనే విభాగాలున్నాయి. అన్ని విభాగాల ఓపీ స్లిప్పులు ఈ కియోస్క్‌లతో పొందవచ్చు. అవసరాన్ని బట్టి మరిన్ని కియోస్క్‌లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.