How to Book IRCTC Tent City Prayagraj: జనవరి 13, 2025 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ఉత్సవం జరగనుంది. ప్రపంచంలోనే మతపరంగా అతి పెద్ద పండుగల్లో ఇది ఒకటి. ఈ కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఎంతో విశిష్టత ఉన్న ఈ కుంభమేళాకు మీరు కూడా వెళ్లి పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయాలనుకుంటున్నారా?అయితే మీరు ముందుగా ఫ్లైట్, ట్రైన్ టికెట్‌తో పాటు టెంట్ బుకింగ్ కూడా చేసుకోవాలి. టెంట్ ఎందుకు బుక్ చేసుకోవాలి? ధర ఎంత? ఎలా బుక్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టెంట్ బుకింగ్ ఎందుకు: ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో విపరీతమైన రద్దీ ఉంటుంది. ఎందుకంటే, ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు. కాబట్టి ముందుగానే మీరు టెంట్ బుక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన బస చేయడంతో పాటు పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి హ్యాపీగా రిటర్న్ జర్నీ చేసుకోవచ్చు. ఇందుకోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం(IRCTC) మహా కుంభ్ గ్రామ్ - IRCTC Tent Cityని ఏర్పాటు చేస్తోంది.
ప్యాకేజీలు ఇవే: IRCTC టెంట్ సిటీలో మొత్తం రెండు రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. అవి సూపర్ డీలక్స్, విల్లా.
- సూపర్ డీలక్స్: ఈ ప్యాకేజీ కావాలనుకునే వారు సింగిల్ ఆక్యూపెన్సీకి రూ.18 వేలకు వరకు చెల్లించాలి. టిఫెన్, లంచ్, డిన్నర్ ఈ ప్యాకేజీలో అందుబాటులో ఉంటాయి. డబుల్ ఆక్యూపెన్సీ అయినా రూ.18,000 చెల్లించాలి. అదనపు బెడ్ కావాలంటే రూ.5 వేలు పే చేయాలి.
- విల్లా: ఈ ప్యాకేజీ కావాలనుకుంటే ఒకరికి రూ.20 వేల వరకు చెల్లించాలి. ఇద్దరు వ్యక్తులకైనా రూ.20 వేల వరకు చెల్లించాలి. అదనపు బెడ్ కావాలంటే రూ.7 వేల వరకు చెల్లించాలి. అయితే మూడు రోజులు బస చేసే వారికి పది శాతం డిస్కౌంట్ కూడా లభించనుంది. ఒక టెంట్‌లో గరిష్టంగా ఇద్దరు పెద్దలు, ఆరేళ్లలోపు పిల్లలు ఒకరు, 11ఏళ్లకు పైబడిన పిల్లలు ఒకరిని మాత్రమే అనుమతిస్తారు.
సౌకర్యాలు ఇవే: టెంట్ సిటీ త్రివేణి ఘాట్‌కు దగ్గరలో ఉండటం వలన పుణ్య స్నానాలు చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఇవి బుక్ చేసుకున్న వారికి శుభ్రమైన బాత్‌రూమ్‌లు, వేడి, చల్ల నీటి సౌకర్యాలు, రోజంతా అందుబాటులో ఉండే సిబ్బంది, రూమ్ బ్లోవర్, బెడ్ లినెన్, టవల్స్, టాయిలెట్‌లు మొదలైన సౌకర్యాలు , భోజనాల వసతితో సహా అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. అలాగే వైద్య సేవలు కూడా సిద్ధంగా ఉంటాయి. సౌకర్యవంతమైన రవాణా కోసం బ్యాటరీ వాహనాలు, షటిల్ సేవలు అందుబాటులో ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, యోగా తరగతులు ఇతర సౌకర్యాలను కల్పించనున్నారు.
ఎలా బుక్ చేసుకోవాలంటే:
- ముందుగా IRCTC అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి(https://www.irctctourism.com). హోమ్ పేజీలోనే ఐఆర్సీటీసీ టెంట్ సిటీ ప్యాకేజీ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. లేదంటే డైరెక్ట్‌గా ఈ లింక్‌పై కూడా క్లిక్ చేసుకోవచ్చు. https://www.irctctourism.com/mahakumbhgram
- ఆ తర్వాత టెంట్ సిటీ ప్యాకేజీకి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. అందులో మీకు కావాల్సిన ప్యాకేజీని అంటే సూపర్ డీలక్స్ లేదా విల్లా ప్యాకేజీపై క్లిక్ చేసి ఎంతమంది వెళ్తున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత Book Now ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీ ఐఆర్సీటీసీ వివరాలతో లాగిన్ అవ్వాలి. ఒకవేళ మీ దగ్గర లాగిన్ వివరాలు లేకపోతే Guest User ఆప్షన్‌పై క్లిక్ చేసి మెయిల్, ఫోన్ నెంబర్ సాయంతో లాగిన్ అవ్వాలి.
- ఆ తర్వాత పేరు, ఎక్కడి నుంచి వస్తున్నారో ఆ వివరాలు ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేయాలి.
- పేమెంట్ పూర్తి అయిన తర్వాత మీరు బుక్ చేసుకున్న ప్యాకేజీ వివరాలు మీ మెయిల్ లేదా ఫోన్‌కు వస్తాయి.
మహా కుంభమేళా పన్నెండేళ్లకు ఒకసారి మాత్రమే ఎందుకు? 'రాజ' స్నానం చేస్తే అంత మంచిదా!
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు