Sunrisers Hyderabad IPL 2024: 2024 ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిలకడగా ఆడుతోంది. చాలా కాలం తర్వాత సన్‌రైజర్స్ ఈ ప్రదర్శన కనబరుస్తోంది. ఈ సీజన్లో ఏకంగా ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన జట్లు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ను ఇప్పటికే మట్టికరిపించగా తాజాగా ఆర్సీబీని సైతం ఓడించి సత్తా చాటింది. బరిలోకి దిగడమే ఆలస్యం పరుగుల సునామీ సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోర్ (287-3) నమోదు చేసి తమ పేరిట ఉన్న పాత రికార్డ్ (277-3)ను బ్రేక్ చేసింది. ఇక ఇలాగే రాణిస్తే టోర్నీలో సన్‌రైజర్స్‌కు తిరుగులేదు.
అయితే ఇంతకుముందు ఐపీఎల్ సీజన్లలో 130- 170 పరుగులు చేయడానికే తీవ్రంగా కష్టపడ్డ సన్‌రైజర్స్ ఈ ఐపీఎల్లో అదరగొడుతుంది. సునాయాసంగా జట్టు స్కోరును 200 దాటించేస్తోంది. గత రెండేళ్లు ఓపెనింగ్ , మిడిలార్డర్ బ్యాటింగ్‌లో సమస్యలతో సన్‌రైజర్స్ సతమతమైంది. పలుమార్లు ఓపెనింగ్ జోడీని మార్చినా పెద్దగా ఫలితం రాలేదు. ఇక మిడిలార్డర్లో రాణించి భాగస్వామ్యం నిర్మించే ప్లేయర్లే కరవయ్యారు. దీంతో సన్‌రైజర్స్ జట్టును ప్రత్యర్థులు కూడా సీరియస్‌గా తీసుకోలేదు. అటు డేవిడ్ వార్నర్ తర్వాత నాయకత్వంలోనూ సన్‌రైజర్స్‌కు విమర్శలు ఎదురయ్యాయి. ఫలితంగా గతంలో 2021, 2022లో 8వ, 2023లో ఏకంగా10వ స్థానానికి పరిమితమైంది.
కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. వన్డే వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సన్‌రైజర్స్‌ను సమర్థంగా నడిపిస్తున్నాడు. ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ రాకతో సన్‌రైజర్స్ ఓపెనింగ్ బలంగా మారింది. ఇక టాప్, మిడిలార్డర్లో అభిషేక్ శర్మ, క్లాసెన్, మర్క్రమ్, సమద్, నితీశ్ రెడ్డితో బ్యాటింగ్ బలంగా మారింది. దీంతో ఇది ఒకప్పటి సన్రైజర్సేనా అంటూ క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.