Cricketers With No Century 2024 :2024 సంవత్సరం దాదాపు పూర్తి కావొచ్చింది. రాబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లక్ష్యంతో కొన్ని దేశాలు టెస్ట్ సిరీస్‌లు ఆడుతున్నాయి. ఇతర దేశాలు టీ20, వన్డే సిరీస్‌లతో బిజీగా ఉన్నాయి. ఈ సంవత్సరం టీ20 వరల్డ్ కప్ సహా చాలా కీలక సిరీస్‌లు జరిగాయి. చాలా మంది ప్లేయర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
కానీ, కొందరు స్టార్ ప్లేయర్లు నిరాశపరిచారు. మూడు ఫార్మాట్‌లలోనూ ఆకట్టుకోలేకపోయారు. గడిచిన పది నెలల్లో ఇప్పటి వరకూ ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోయారు. ఈ ఏడాది ఒక్క సెంచరీ కూడా లేకుండా ఎక్కువ ఇన్నింగ్స్‌లు ఆడిన టాప్ ప్లేయర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- బాబర్ అజామ్ :పాకిస్థాన్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ 2024లో ఒక్క సెంచరీ కూడా కొట్టలేకపోయాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి ఏకంగా 29 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అత్యధిక స్కోరు 75. మొత్తంగా ఈ ఏడాది 888 పరుగులు చేశాడు.
- సైమ్ అయూబ్ :ఈ లిస్టులో మరో పాక్ ప్లేయర్ సైమ్ ఆయూబ్ ఉన్నాడు. ఈ సంవత్సరంలో ఒక్క వంద కూడా చేయలేదు. మొత్తం 29 ఇన్నింగ్స్‌లలో 634 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 82.
- గ్లెన్ ఫిలిప్స్ :న్యూజిలాండ్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ కూడా ఈ ఏడాది ఇంకా సెంచరీ చేయలేదు. ఈ సంవత్సరంలో 27 ఇన్నింగ్స్‌లలో 701 పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోరు 78.
- మిచెల్ మార్ష్ : ఆస్ట్రేలియా కీలక ఆటగాడు మిచెల్ మార్ష్ ఈ ఏడాది 27 ఇన్నింగ్స్‌ల్లో బరిలో దిగినప్పటికీ మూడంకెల స్కోర్ నమోదు చేయలేదు. మొత్తం 689 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 80.
- విరాట్ కోహ్లీ : టీమ్‌ఇండియా స్టార్ ప్లేయర్ కోహ్లీ ఈ ఏడాది దారుణంగా ఆడుతున్నాడు. ఇప్పటి వరకూ 25 ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ సెంచరీ చేయలేకపోయాడు. ప్రస్తుత తరం సెంచరీల రారాజు విరాట్ ఈ ఏడాది పది నెలల గడిచినా ఒక్క శతకం కూడా బాదలేదు. ఇది ఫ్యాన్స్‌ను కాస్త కలవరపాటుకు గురిచేసేదే. అయితే త్వరలోనే ప్రారంభం కానున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో విరాట్ బరిలోకి దిగనున్నాడు. ఈ సిరీస్‌లోనైనా విరాట్ సెంచరీ బాదాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
- సదీర సమరవిక్రమ: శ్రీలంక బ్యాటర్ సదీర సమరవిక్రమ 2024లో 24 ఇన్నింగ్స్‌ల్లో బరిలోకి దిగాడు. కానీ, ఇప్పటి వరకు శతకం మార్క్ అందుకోలేదు. మొత్తం 486 పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోరు 61.