Special Jersey In IPL:ఐపీఎల్‌లో ఆయా ఫ్రాంచైజీలు తమతమ రెగ్యులర్ జెర్సీల్లో కాకుండా స్పెషల్ జెర్సీలు ధరించి ప్రతి సీజన్‌లో ఓ మ్యాచ్ ఆడుతున్నాయి. ఇలా పలు ఫ్రాంచైజీలు గత కొన్ని సీజన్లుగా ఈ సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నాయి. అయితే సమాజంలోని పలు అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ స్పెషల్ జెర్సీల ముఖ్య ఉద్దేశం అని ఆ ఫ్రాంచైజీలు చెబుతుంటాయి. అలా 2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేసిన ఈ ప్రయోగాన్ని అనంతరం చాలా టీమ్‌లు ఫాలో అయ్యాయి.
ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో రీసెంట్గా రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీతో మ్యాచ్‌లో ఫుల్ పింక్ కలర్ జెర్సీ ధరించి బరిలోకి దిగింది. తాజాగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ప్లేయర్లు ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లోనూ స్పెషల్ జెర్సీ ధరించారు. ఇలా ఇప్పటి వరకు చాలా ఫ్రాంచైజీలు కొన్ని ప్రత్యేక కారణాలతో స్పెషల్ జెర్సీలు ధరించాయి. మరి ఐపీఎల్‌లో ఏయే టీమ్ స్పెషల్ జెర్సీలు ధరిస్తున్నాయి? ఆ స్పెషల్ జెర్సీల వెనుక కథేంటో మీకు తెలుసా?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ప్రత్యామ్నాయ కిట్‌లతో ప్రయోగాలు చేయడంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. ఈ సంప్రదాయాన్ని 2011లో ప్రారంభించారు. 'గో గ్రీన్' క్యాంపెయిన్‌కి సపోర్ట్‌గా ఈ జెర్సీ ధరించారు. బెంగళూరు గ్రీన్ కిట్‌ను చాలాసార్లు మార్చినా 2023లో గ్రీన్, బ్లాక్ కాంబినేషన్ ఫ్యాన్స్‌కి తెగ నచ్చేసింది. ఐపీఎల్ 2021లో, RCB COVID-19 వారియర్స్‌కి నివాళిగా బ్లూ కలర్ కిట్‌ను ధరించింది.
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) 2023లో కోల్‌కతా ఫుట్‌బాల్ దిగ్గజం మోహన్ బగాన్ స్ఫూర్తితో గ్రీన్, మెరూన్ జెర్సీని ధరించింది. ఈ రోజు (14-04-2024) కూడా కేకేఆర్‌తో మ్యాచ్‌లో అదే జెర్సీతో బరిలో దిగింది. గ్రీన్, మెరూన్ కాంబినేషన్ చాలా మందికి నచ్చింది. కోల్‌కతాకు చెందిన మోహన్ బగాన్ ఫుట్‌బాల్ క్లబ్‌కు ట్రిబ్యూట్ ఇచ్చేలా గ్రీన్, మెరూన్ కలర్ జెర్సీలో ఆటగాళ్లు బరిలోకి దిగారు.