Smriti Mandhana ICC Rankings :ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అదరగొట్టింది. వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో మంధాన టాప్-3లోకి దూసుకొచ్చింది. వన్డే ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరిన మంధాన, టీ20 ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపర్చుకుని మూడో ర్యాంక్ దక్కించుకుంది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ సిరీసుల్లో ప్రదర్శనల ఆధారంగా మంధాన ర్యాంక్‌లు మెరుగుపడ్డాయి.
రాకెట్లా దూసుకొచ్చిన స్మృతి మంధాన
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో మంధాన సూపర్ సెంచరీ (105) చేసింది. తాజాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో మెరుపు అర్ధ సెంచరీ (54) సాధించింది. ఈ క్రమంలో ఆమె ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో టాప్-3లో చోటు దక్కించుకుంది. అలాగే, టీమ్ ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వన్డేల్లో రెండు స్థానాలు దిగజారి 13వ ప్లేస్‌కు పడిపోయింది. టీ20 ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగై పదో ప్లేస్‌లో నిలిచింది.
భారత్‌తో వన్డే సిరీస్‌లో బ్యాట్‌తో అదరగొట్టిన అన్నాబెల్ సదర్లాండ్ ఏకంగా 15 స్థానాలు ఎగబాకి 29వ స్థానానికి చేరుకుంది. తహ్లియా మెక్‌గ్రాత్ 8స్థానాలు ఎగబాకి 24వ ప్లేస్‌లో నిలిచింది. ఆసీస్‌తో తొలి టీ20లో అదరగొట్టిన జెమీమా రోడ్రిగ్స్ ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని 15వ ప్లేస్‌కు చేరుకుంది. షఫాలీ వర్మ 13వ స్థానంలో కొనసాగుతోంది.