SL vs SA T20 World Cup 2024:టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా సత్తా చాటింది. సోమవారం జరిగిన గ్రూప్-డి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపొందింది. నోకియా (4/7) ధాటికి మొదట లంక 19.1 ఓవర్లలో 77 పరుగులకే కుప్పకూలగా, రబాడ (2/21), కేశవ్ మహరాజ్ (2/22) కూడా ఆ జట్టును తమ ఇన్నింగ్స్‌లో దెబ్బతీశారు. 19 పరుగులు చేసిన కుశాల్ మెండిస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇక లంక నిర్దేశించిన లక్ష్యాన్ని సౌతాఫ్రికా 16.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. క్లాసెన్ (19 నాటౌట్), డికాక్ (20) రాణించారు. నోకియాకు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
మ్యాచ్ సాగిందిలా
టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఘనమైన ఆరంభమేమీ దక్కలేదు. సౌతాఫ్రికా బౌలర్ల దెబ్బకు లంక బ్యాటింగ్ ఆర్డర్టపటపా కూలిపోయింది. ఓపెనర్లు పాతుమ్ నిస్సంకా (3), కుశాల్ మెండీస్ (19) తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. వన్‌డౌన్‌లో కామిందు మెండిస్ (11) కూడా విఫలమయ్యాడు. ఇక కెప్టెన్ వానిందు హసరంగ (0), సదీర సమరవిక్రమ (0) వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. ఇక అసలంక (6), శనాక (9), మ్యాథ్యూస్ (16), మతీషా పతిరణ (0), నువాన్ తుషారా (0) స్పల్ప స్కోర్లకే వెనుదిరిగారు. సఫారీ బౌలర్లలో అన్రిట్ నోకియా 4 వికెట్లతో లంక పతనాన్ని శాసించాడు. కేశవ్ మహారాజ్, కగిసో రబాడా చెరో 2, బార్త్‌మన్ 1 వికెట్ దక్కించుకున్నారు.