Shuttler Sai Praneeth Retirement :చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్‌తో పిచ్చి ప్రేమతో రాకెట్‌ను తన ఆయుధంగా మార్చుకుని కెరీర్లో అంచెలంచెలుగా ఎదిగాడు. ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకంతో సత్తాచాటి సీనియర్ స్థాయిలోనూ దూసుకెళ్లాడు. అలా ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఈ కాంస్య మెడల్ దక్కించుకుని 36 ఏళ్ల భారత నిరీక్షణకు తెరదించాడు. అయితే కెరీర్ మంచి ఫుల్ ఫామ్‌లో ఉండగా మధ్యలో కరోనా, ఆ తర్వాత గాయాలు బాగా ఇబ్బంది పెట్టాయి. దీంతో తిరిగి కోలుకోలేకపోయాడు. అయినా తనకేమీ బాధ లేదని, సాధించిన దానితో సంతృప్తిగా ఉన్నానని అంటూ బ్యాడ్మింటన్‌కు గుడ్‌బై చెప్పేసి అందరినీ షాక్‌కు గురి చేశాడు తెలుగు షట్లర్ సాయి ప్రణీత్. ఈ సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలను పంచుకున్నాడు.
ఇప్పుడే ఆటకు వీడ్కోలు ఎందుకు పలికారు? ఇదే సరైన సమయమని ఎందుకు అనిపించింది?
కరోనా బ్రేక్, ఆ తర్వాత గాయాలు నన్ను వెనక్కిలాగాయి. మళ్లీ బెస్ట్ పెర్ఫామెన్స్ చేయాలని ప్రయత్నించినా అవ్వలేదు. అందుకే ఇక చాలని అనుకుని సంతృప్తితోనే ముగించా.
మీకున్న స్కిల్స్‌కు టాలెంట్‌కు తగ్గట్లుగా సక్సెస్ సాధించలేకపోయారనే అభిప్రాయం ఉంది. మీరేం అంటారు?
బహుశా కావొచ్చేమో! నేను సరిగ్గా ప్రయత్నించకపోయి ఉంటే సరైన సమాధానం వచ్చేది. ఫలితం అనుకున్నట్లు రాకపోవచ్చు. కానీ నేను కష్టపడ్డాను. మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయడమే నా చేతుల్లో ఉంది. గెలిచానా లేదా అన్నది కాదు. నా వరకు కష్టపడుతూనే వచ్చాను. ఏది రావాలో అదే వచ్చిందని అనుకుంటున్నాను. అందుకే ఎలాంటి బాధ లేదు. నా కెరీర్ పట్ల సంతోషంగా ఉన్నా.
మీ కెరీర్లో ది బెస్ట్ పెర్ఫామెన్స్ అంటే ఏం చెబుతారు?
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మెడల్ గెలవడం, సింగపూర్ ఓపెన్ టైటిల్ దక్కించుకోవడం, ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించడం నా కెరీర్లో ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతాయి.
ఇన్నేళ్ల సుదీర్ఘ కెరీర్లో నిరాశ కలిగించిన క్షణాలున్నాయా?
నా ఈ 24 ఏళ్ల క్రీడా జర్నీ కచ్చితంగా నిరాశ కలిగించిన సందర్భాలు ఉన్నాయి. అలా అని నేనెప్పుడు ఆటను నిర్లక్ష్యం చేయలేదు. నిరాశ కలిగిన ప్రతిసారి మరింత కష్టపడి, పుంజుకోవడానికి మాత్రమే ప్రయత్నించాను.