తెలంగాణ

telangana

ETV Bharat / sports

లంకను అతలాకుతలం చేసి, ప్రపంచకప్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచి - ధావన్ స్పెషల్ ఇన్నింగ్స్ ఇవే! - Shikhar Dhawan Special Innings - SHIKHAR DHAWAN SPECIAL INNINGS

Shikhar Dhawan Special Innings : టీమ్‌ ఇండియా గబ్బర్​గా చెప్పుకొనే శిఖర్ ధావన్‌ తన క్రికెట్ కెరీర్​లో ఎన్నో అద్భుతాలు చేశాడు. సొగసైన కవర్‌ డ్రైవ్‌లు, అవసరానికి తగ్గట్లు భారీ షాట్లు ఆడే ఈ స్టార్ ప్లేయర్ గతంలో ఆడిన కీలక ఇన్నింగ్స్‌లు ఒకసారి గుర్తు చేసుకుందామా?

Shikhar Dhawan
Shikhar Dhawan (AFP)

By ETV Bharat Sports Team

Published : Aug 24, 2024, 12:51 PM IST

Shikhar Dhawan Special Innings : టీమ్‌ ఇండియా స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 14 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 2010లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన గబ్బర్‌, 2024 వరకూ టీమ్ఇండియాకు సేవలు అందించాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్‌లు ఆడి ఆపద్బాంధువుడి పాత్ర పోషించాడు. భారత జట్టు ఓపెనర్‌గా శిఖర్‌ ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. అందులో కొన్ని ఇన్నింగ్స్‌లను ఓసారి జ్ఞాపకం తెచ్చుకుందామా?

ఆస్ట్రేలియాపై అరంగేట్ర శతకం
2013లో మొహాలి వేదికగా జరిగిన మ్యాచ్‌ శిఖర్‌ ధావన్‌కు అది తొలి టెస్టు. ఆడుతున్నది అరవీర భయంకర బౌలర్లు ఉన్న ఆస్ట్రేలియాతో. అయినా గబ్బర్‌ వెనకడుగు వేయలేదు. ఆడిన తొలి టెస్ట్‌లోనే శతకం సాధించి సత్తా చాటాడు. టీమ్‌ ఇండియా క్రికెట్‌ చరిత్రలో 17 మంది బ్యాటర్లు టెస్టు అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన ప్లేయర్ల జాబితాలో ఒకడిగా ధావన్‌ నిలిచాడు. పటిష్టమైన కంగారుల బౌలర్లను ఎదుర్కొని కేవలం 85 బంతుల్లోనే సెంచరీ చేసి అరంగేట్ర మ్యాచ్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. మోయిసెస్ హెన్రిక్స్, నాథన్ లియోన్, జేవియర్ డోహెర్టీల స్పిన్‌ మాయాజాలాన్ని ఎదుర్కొంటూ ధావన్ 33 ఫోర్లు, 2 సిక్సర్లతో 187 పరుగులు చేశాడు.

ఓపెనర్‌గా తొలి శతకం
2013లో కార్డిఫ్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మతో కలిసి ఓపెనర్‌గా తొలిసారి బరిలోకి దిగిన శిఖర్‌ ధావన్‌ శతకంతో చెలరేగాడు. మూడేళ్ల తర్వాత మళ్లీ భారత వన్డే జట్టులోకి వచ్చిన ధావన్ ఈసారి సెంచరీ చేసి మెరిశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో శిఖర్‌ చేసిన ఈ శతకంతో భారత జట్టులో స్థానం సుస్థిరమైంది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మతో కలిసి తొలి వికెట్‌కు ధావన్‌ 127 పరుగులు జోడించాడు. ఆ తర్వాత రోహిత్‌-ధావన్‌ జోడీ 18 సార్లు శతక భాగస్వామ్యం నెలకొల్పారు.

శతకం చేయకపోయినా
2014లో వెల్లింగ్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శిఖర్‌ ధావన్‌ 98 పరుగులు చేశాడు. శతకం చేజారిన ఇది శిఖర్‌ ధావన్‌ ఆడిన ఇన్నింగ్స్‌లో కీలకమైనదిగా గుర్తింపు పొందింది. ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ చెలరేగడం వల్ల కివీస్‌ కేవలం 192 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత భారత్‌ 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ధావన్‌ ఆపద్బాంధవుడి పాత్ర పోషించి 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 98 పరుగులు చేసి భారత్‌ను ఆదుకున్నాడు.

ప్రపంచకప్‌లో టాప్‌ స్కోరర్‌గా
2015 ప్రపంచకప్‌లో శిఖర్‌ ధావన్‌ భీకర ఫామ్‌ కొనసాగింది. ఆ వరల్డ్‌ కప్‌లో భారత తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధావన్‌ నిలిచాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 137 పరుగులతో చెలరేగాడు. 16 ఫోర్లు, 2 సిక్సర్లతో తొలి ప్రపంచకప్ సెంచరీతో సఫారీల పనిపట్టాడు. స్టెయిన్, వెర్నాన్ ఫిలాండర్, మోర్నే మోర్కెల్ వంటి పేస్‌ దిగ్గజాల బౌలింగ్‌ను ఎదుర్కొంటూ ధావన్‌ చేసిన ఈ సెంచరీ అతడి కెరీర్​లోని కీలక ఇన్నింగ్స్‌ల్లో ముఖ్యమైనది.

లంకను అతలాకుతలం చేసి
2017లో గాలె వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో ధావన్‌ లంక బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. శ్రీలంక బౌలింగ్ దాడిని కట్టడి చేశాడు. తొలి రోజే కేవలం 168 బంతుల్లోనే 190 పరుగులు చేశాడు. 110 బంతుల్లో 16 బౌండరీలతో సెంచరీ చేసిన ధావన్‌ తర్వాత కూడా చెలరేగి ఆడాడు.

బ్రాండ్​ ఎండార్స్​మెంట్లు, కోట్ల విలువైన ఆస్తులు - ధావన్ లగ్జరీ లైఫ్​ గురించి మీకు తెలుసా? - Shikhar Dhawan Net Worth

క్రికెట్​కు శిఖర్​ ధావన్ గుడ్​బై- రిటైర్మెంట్​ ప్రకటించిన 'గబ్బర్'​ - Shikhar Dhawan Retirement

ABOUT THE AUTHOR

...view details