Rohit Virat Pakistan Visit:టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యేలోపు పాకిస్థాన్‌ను సందర్శించాలని ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఆకాంక్షించాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో అక్మల్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లు అయిన రోహిత్, విరాట్‌కు పాక్‌లో కూడా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందిని అక్మల్ అన్నాడు.
'విరాట్, రోహిత్ తమతమ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించే ముందు పాకిస్థాన్‌ను సందర్శిస్తే బాగుంటుంది. ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు ప్రపంచ వ్యాప్తంగా పర్యటించారు. ప్రతీ క్రికెట్ అభిమాని వాళ్లను ఇష్టపడతాడు. వాళ్ల బ్యాటింగ్, మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్‌లకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కోహ్లీ తన ప్రదర్శనతో ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. రోహిత్ ఇప్పుడు వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్. ప్రస్తుత వరల్డ్ క్రికెట్లో జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ పేసర్. ఈ ముగ్గురు ప్లేయర్లు పాకిస్థాన్‌లో ఆడినప్పుడు ప్రతి అభిమానికి ప్రత్యేకమైన ఫీల్ ఉంటుంది. అయితే విరాట్ అండర్- 19 సమయంలో పాకిస్థాన్ వచ్చాడు. కానీ, అప్పుడు అతడు అంత పెద్ద స్టార్ కాదు. టీమ్ఇండియా పాక్‌లో ఆడితే ఈ స్టార్లు ప్రపంచంలో ఎక్కడాలేని ఫ్యాన్ బేస్ అనుభూతిని పొందుతారు' అని అక్మల్ అన్నాడు.