Rajasthan Royals Vs Delhi Capitals IPL 2024:2024 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జోరు కొనసాగుతోంది. జైపుర్ వేదికగా గురువారం దిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో నెగ్గింది. యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ ధనాధన్ ఇన్నింగ్స్ (84* పరుగులు; 45 బంతుల్లో 7×4, 6×6)తో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 185 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో దిల్లీ 173-5 పరుగులకే పరిమితమైంది. రాజస్థాన్ బౌలర్లలో బర్గర్ , చాహల్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఇక సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న రియాన్ పరాగ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
186 పరుగులు టార్గెట్ ఛేదించే క్రమంలో దిల్లీ బ్యాటర్లు డేవిడ్ వార్నర్ (49 పరుగులు; 34 బంతుల్లో 5×4, 3×6), ట్రిస్టియన్ స్టబ్స్ (44* పరుగులు; 23 బంతుల్లో 2×4, 3×6) రాణించారు. మిచెల్ మార్ష్ (23 పరుగులు), కెప్టెన్ రిషభ్ పంత్ (28 పరుగులు) ఆకట్టుకోలేదు. చివర్లో అక్షర్ పటేల్ (15 పరుగులు), స్టబ్స్ క్రీజులో ఉన్నప్పటికీ, రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల దిల్లీకి ఓటమి తప్పలేదు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఇన్నింగ్స్‌ను పేలవంగానే ఆరంభించింది. జైశ్వాల్ (5), బట్లర్ (11), శాంసన్ (15) విఫలమయ్యారు. ఈ దశలో రియాన్ అద్భుతంగా ఆడాడు. ఫోర్లు, సిక్స్‌లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఆఖర్లో నోకియా (20), హెట్మెయర్ (14*) రాణించారు. దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, నోకియా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.