RCB New Captain : యంగ్ బ్యాటర్ రజత్ పటిదార్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ తమ జట్టు కెప్టెన్‌గా నియమించింది. 2025 ఐపీఎల్లో ఆర్సీబీ జట్టుకు రజత్ నాయకత్వం వహించనున్నట్లు గురువారం అధికారిక ప్రకటన చేసింది. ఈసారి టైటిల్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆర్సీబీ జట్టులో కీలక మార్పులు చేసింది. ఈ నేపథ్యంలోనే కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసింది.
పటిదార్‌కు దేశవాళీలో నాయకత్వం వహించిన అనుభవం ఉంది. ఇదివరకు పటిదార్ విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీలో మధ్యప్రదేశ్ జట్టుకు కెప్టెన్సీగా చేశాడు. అయితే ముందునుంచి విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ పేర్లు కూడా కెప్టెన్సీ పరిశీలనలో ఉన్నాయి. కానీ, భవిష్యత్‌లో లాంగ్ టర్మ్ జట్టులో కొనసాగాలన్న ఉద్దేశంతో యాజమాన్యం రజత్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఇక కొత్త కెప్టెన్‌గా ఎంపికైన రజత్‌కు విరాట్సహా ఆర్సీబీ ప్లేయర్లు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు.
కాగా, 31 ఏళ్ల రజత్ పటీదార్ భారత్ తరఫున గతేడాదే టెస్టుల్లోకి అరంగేట్రం చేయగా, 2023లో వన్డేల్లోకి వచ్చాడు. మూడు టెస్టులు, ఒకే ఒక్క వన్డే ఆడాడు. అయితే ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20లు ఆడిన అనుభవం అతడికి లేకపోవడం గమనార్హం. ఇక ఐపీఎల్ విషయానికొస్తే, 2021లో రజత్ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 27 మ్యాచ్‌లు ఆడాడు. 34.74 సగటుతో 799 పరుగులు చేశాడు.