Rohit Virat Opening:2024 టీ20 వరల్డ్‌కప్ గురించి టీమ్ఇండియా ఎంపిక, ఓపెనింగ్ జోడీపై వస్తున్న వార్తల పట్ల కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, మైఖేల్ వాన్తో రీసెంట్గా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తనతో కలిసి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేయనున్నాడన్న ప్రచారాన్ని కొట్టిపారేశాడు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు.
'నేను ఈ మధ్య ఎవరినీ (కోచ్, సెలక్టర్‌ను ఉద్దేశించి) కలవలేదు. రానున్న టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఇన్నింగ్స్ ఎవరు ప్రారంభించాలనేది (Opening Batters) కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఇలాంటి విషయాలు నేను లేదా కోచ్ రాహల్ ద్రవిడ్, సెలక్టర్ అజిత్ అగార్కర్, ఎవరైనా బీసీసీఐ అధికారి కెమెరా ముందుకు వచ్చి చెబితేనే నమ్మండి. అంతేతప్ప మిగతావన్నీ ఫేక్' అని రోహిత్ అన్నాడు. ఇక ఇదే పాడ్‌కాస్ట్‌లో మాజీ కెప్టెన్ ఎమ్ ఎస్ ధోనీ గురించి కూడా రోహిత్ మాట్లాడాడు. ధోనీ, దినేశ్ కార్తిక్ ఈ ఇద్దరిలో ఎవరిని వరల్డ్‌కప్‌లో వికెట్ కీపర్‌గా చూడవచ్చుని గిల్‌క్రిస్ట్ అడగ్గా రోహిత్ ఇంట్రెస్టింగ్గా రిప్లై ఇచ్చాడు.
'దినేశ్ గతకొన్ని మ్యాచ్‌ల్లో బాగా ఆకట్టుకున్నాడు. అద్భుతంగా రాణిస్తున్నాడు. ధోనీ కూడా ముంబయితో మ్యాచ్‌లో ఆఖర్లో 4 బంతుల్లో 20 పరుగులు బాదాడు. ఆ పరుగులే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాయి. అయితే ధోనీ వెస్టిండీస్ (వరల్డ్‌కప్ కోసం)కు రాకపోవచ్చు. అతడిని ఒప్పించడం కష్టం. ఐపీఎల్ తర్వాతో ధోనీ అలసిపోతాడు. అయితే అతడు గోల్ఫ్ ఆడడానికి అమెరికా వస్తాడు అనుకుంటున్నా. ఇక దినేశ్ కార్తిక్ వరల్డ్‌కప్ ఎంపికకు ఆప్షన్‌గా ఉంటాడని అనుకుంటున్నా' అని రోహిత్ అన్నాడు.