Rohit Sharma T20 World Cup : బీసీసీఐ సెక్రటరీ జై షా ఇటీవలే పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్ నుంచి మొదలయ్యే టీ20 ప్రపంచకప్ పోటీల్లో రోహిత్ శర్మ సారథ్యంలోనే భారత జట్టు బరిలో దిగనుందని ఆయన వెల్లడించారు. రోహిత్ సారథ్యంలోనే ప్రపంచ కప్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగిన ఓ ఈవెంట్ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇక 2023 వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలు సాధించిన టీమ్‌ఇండియా ప్లేయర్లు అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్స్‌లో ఓడినప్పటికీ క్రికెట్ లవర్స్ మనసులు గెలుచుకుందన్నారు. 2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జెండా రెపరెపలాడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
అయితే గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా భారత జట్టును నడిపించిన రోహిత్ శర్మ ఆ తర్వాత ఈ ఫార్మాట్లో బరిలోకే దిగలేదు. కోహ్లి సైతం టీ20లకు దూరంగానే ఉన్నాడు. అప్పట్నుంచి హార్దిక్ పాండ్య సారథ్యంలోనే జట్టు ఆడుతోంది. అతను అందుబాటులో లేనపుడు తాత్కాలిక కెప్టెన్ల నాయకత్వంలో ఆడుతోంది. వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో రోహిత్, కోహ్లి టీ20 జట్టులోకి పునరాగమనం చేస్తారా అన్న చర్చలు జరిగాయి. అయితే ఇప్పుడు జై షా మాటలతో హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.