Rohit Sharma Mumbai Indians :ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సిరీస్‌లో ముంబయి ఇండియన్స్ జట్టుకు సారధ్య బాధ్యతలు వహిస్తున్నాడు స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా. అంతకుముందు ఆ జట్టుకు ఐదుసార్లు కప్ అందించిన రోహిత్ శర్మకు బదులుగా హార్దిక్‌ను ఎంచుకుంది మేనేజ్మెంట్. దీంతో ఈ విషయంపై అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అతడిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. ఫ్యాన్స్ కూడా స్టేడియంలో హేళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు రానున్న వరల్డ్ కప్ రోహిత్ శర్మ సారథ్యంలోనే జరగనుంది. అతడికి డిప్యూటీగా పాండ్యను నియమించారు. ఇక నిన్న ( మే 2న) ఓ ప్రెస్ మీట్ జరిగింది. అందులో కెప్టెన్ రోహిత్ శర్మ, ఇంకా అజిత్ అగార్కర్ వచ్చి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ముంబయి కెప్టెన్సీ వ్యవహారంపై రోహిత్ తొలిసారి స్పందించాడు.
"జీవితంలో అటువంటివి సహజమే. ఏదీ కూడా మనం అనుకున్నట్లుగా జరగవు. ప్రతి దానికి ఓ గొప్ప అనుభవం ఉంటుంది. హార్దిక్ కెప్టెన్సీలో ఆడే విషయంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నేను కెప్టెన్ కానప్పుడు చాలా మంది సారధ్యంలో మ్యాచ్‌లు ఆడాను. నాకు ఇలాంటివేమీ కొత్త కాదు. ఇప్పుడు ఆ విషయంలో పెద్దగా వ్యత్యాసమూ లేదు. ఐపీఎల్ 17వ సీజన్‌లో కేవలం భారీగా పరుగులు చేసే దానిపై దృష్టి పెట్టలేదు. జట్టుకు అవసరమైన ఆరంభాలను ఇవ్వాలని అనుకుంటున్నాను. దాని కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఓపెనర్‌గా వచ్చిన సమయంలోనూ దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉంటుంది" అంటూ రోహిత్ క్లారిటీ ఇచ్చాడు.