IND VS ENG 2ND ODI Rohit Sharma :ఇటీవల కాలంలో ఫామ్ లేమితో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. వాటికి కటక్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డేలో విధ్వంసకర సెంచరీ(119) చేసి సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం తనపై వచ్చిన విమర్శలు, ఫామ్‌పై రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
'ఇంగ్లాండ్‌పై నేను బాదిన సెంచరీ వల్ల ఏమీ మారదు. నా వర్క్‌లో ఇదొక రోజు అంతే. నేను చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్నాను. ఎలా ఆడాలో నాకు స్పష్టత ఉంది. ఒకటి లేదా రెండు ఇన్నింగ్స్ నా మనసును మార్చవు. మైదానంలో నేను అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం ముఖ్యం. నేను మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కొన్నిసార్లు అది సాధ్యమవుతుంది. మరికొన్ని సార్లు సాధ్యం కాదు. గ్రౌండ్ ఏమి చేయాలో నాకు స్పష్టత ఉంది. ఇంకేమీ పట్టించుకోను. అయితే ప్రతిసారి ఎక్కువ పరుగులు సాధించడం అంత ఈజీ కాదు' అని మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడాడు.
రోహిత్ శర్మ సాధించిన రికార్డులు
రోహిత్ శర్మ తాజా శతకంలో పలు రికార్డులను బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-10లోకి దూసుకొచ్చాడు. రాహుల్ ద్రవిడ్ (10,889 పరుగులు, 318 ఇన్నింగ్స్ లు)ను అధిగమించి హిట్ మ్యాన్ పదో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం రోహిత్ 10,964 పరుగులు (264 ఇన్నింగ్స్ లు)చేశాడు.
సచిన్‌ను అధిగమించిన రోహిత్
భారత జట్టు తరఫున ఓపెనర్‌గా దిగి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ రెండో ప్లేస్‌లో నిలిచాడు. సచిన్ (15,335 పరుగులు)ను దాటేసి రోహిత్(15,404 రన్స్) సెకండ్ పొజిషన్ కు చేరుకున్నాడు. ఈ లిస్ట్‌లో టాప్ లో వీరేంద్ర సెహ్వాగ్ (15,758) ఉన్నాడు.
విజయాల్లో రికార్డు
టీమ్ ఇండియా తరఫున 50 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించాడు రోహిత్. ఇందులో కటక్‌లో ఇంగ్లాండ్‌పై టీమ్ఇండియాను విజయ తీరాలను చేర్చడం వల్ల 36 విజయాలు రోహిత్ ఖాతాలో పడ్డాయి. దీంతో వన్డేల్లో కెప్టెన్‌గా విజయాల్లో విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్(36)తో సమానంగా ఉన్నాడు. విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్, క్లైవ్ లాయిడ్ 39 విజయాలతో అగ్రస్థానంలో ఉన్నారు.
అత్యధిక సిక్సులు
ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 7 సిక్సర్లు కొట్టాడు. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు (338) బాదిన రెండో బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్(331)ను దాటేశాడు. పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది 351 సిక్స్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
కాగా, కటక్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 305 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్ష్యాన్ని టీమ్ ఇండియా 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్ లు) రాణించాడు. అలాగే గిల్ (60) శ్రేయస్ అయ్యర్ (44), అక్షర్ పటేల్ (41*) అదరగొట్టారు.