స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్ ఇండియా ఓడిపోయింది. దీంతో 12 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఒకే క్యాలెండర్ ఇయర్లో సొంత గడ్డపై టీమ్ ఇండియా రెండు టెస్టుల్లో ఓటమిపాలైంది. అలాగే 36 ఏళ్ల తర్వాత భారత్‌లో కివీస్ తొలి టెస్టు గెలిచింది. ఇలా ఈ టెస్టు మ్యాచ్ ఓటమితో భారత్ పలు పేలవమైన రికార్డులు నమోదు చేసింది. అలాగే రోహిత్ శర్మ కూడా ఓ చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. అదేంటంటే?
రోహిత్ కెప్టెన్సీలో మూడు ఓటములు
రోహిత్ కెప్టెన్సీలో స్వదేశంలో భారత్ ఇప్పటివరకు మూడు టెస్టుల్లో ఓడిపోయింది. రోహిత్‌తో పాటు ఎంఎస్ ధోనీ, సౌరభ్ గంగూలీ, సచిన్ తెందూల్కర్, బిషన్ సింగ్ బేడీ వంటి దిగ్గజాల కెప్టెన్సీలో కూడా భారత్ మూడు టెస్టుల్లో ఓటమిపాలైంది. అత్యధికంగా మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఆధ్వర్యంలో భారత్ 9 టెస్టుల్లో ఓటమిచవిచూసింది.
- మన్సూర్ అలీఖాన్ పటౌడీ-9
- మహ్మద్ అజారుద్దీన్- 4
- కపిల్ దేవ్- 4
- రోహిత్ శర్మ-3
- బిషన్ బేడీ-3
- ఎంఎస్ ధోనీ-3
- సౌరభ్ గంగూలీ-3
- సచిన్ తెందూల్కర్ -3
ఒకే క్యాలెండర్ ఇయర్ రెండు ఓటములు
2012లో టీమ్ ఇండియా ఒకే క్యాలెండర్ ఇయర్లో స్వదేశంలో రెండు టెస్టులు ఓడిపోయింది. మళ్లీ 12 ఏళ్ల తర్వాత 2024లోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది. ఈ ఏడాది జనవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్ లో మొదటి టెస్టులో టీమ్ ఇండియా 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. తాజాగా కివీస్ తో జరిగిన టెస్టులో పరాజయంపాలైంది.