Rohit Sharma IND Vs AUS :తన రిటైర్మెంట్ విషయంలో సందిగ్ధత నెలకొన్న తరుణంలో రోహిత్ శర్మ తాజాగా పలు రూమర్స్‌కు బ్రేక్ వేశాడు. సిడ్నీ టెస్టు ఆడకపోవడంపై, అలాగే రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయంలో ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి రోహిత్ తానే బెంచ్‌కు పరిమితం కావాలని అనుకున్నట్లు వెల్లడించాడు. తన ఫామ్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. జట్టు అవసరాలే తనకు ముఖ్యమని , అందుకే తాను సిడ్నీ టెస్టులో ఆడకుండా విశ్రాంతి తీసుకున్నట్లు తెలిపాడు. తనను ఎవ్వరూ తప్పించలేదని క్లారిటీ ఇచ్చాడు.
"నేను రిటైర్మెంట్ తీసుకోవట్లేదు. సిడ్నీ టెస్టు నుంచి మాత్రమే తప్పుకున్నాను. జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకొనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. పెర్త్ టెస్టులో కేఎల్ రాహుల్ - యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఆ జోడీని మార్చకూడదనే ఉద్దేశంతో ఇలా చేశాను. అదీ కాకుండా ఫామ్ పరంగానూ కేఎల్ మెరుగ్గా ఉన్నాడు. కీలకమైన పోరులో ఫామ్‌తో ఇబ్బందిపడే ప్లేయర్లను వద్దని భావించాం. ఇది ఎంతో సెన్సిటివ్ డెసిషన్. కానీ, మాకు జట్టు ప్రయోజనాలే ముఖ్యం. ఆ తర్వాతే నేను. ఇక మీడియాలో వస్తున్నట్లుగా డ్రెస్సింగ్ రూమ్‌లో ఎటువంటి సమస్యలు లేవు. అటువంటి రూమర్స్‌ను మనం కంట్రోల్ చేయలేం. ఇప్పుడు నేను అంతగా పరుగులు చేయలేకపోయాను. అయితే రానున్న ఐదు నెలల్లో పరుగులు చేయనని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. అందుకే నా ఫామ్ కోసం నేను నిరంతరం శ్రమిస్తాను. కానీ ల్యాప్‌ట్యాప్‌లు, పేపర్, పెన్నులను ముందేసుకొనేవారు నేను ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలి? ఎప్పుడు ఏం చేయాలనేది నిర్ణయించలేరు. నేను ఇద్దరు పిల్లల తండ్రిని. నాకు ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో బాగా తెలుసు. ఇక మైదానంలో (కొన్‌స్టాస్ - బుమ్రా వాగ్వాదంపై) మా కుర్రాళ్లు ఎప్పుడూ పీస్ఫుల్గానే ఉంటారు. ఎవరైనా స్లెడ్జింగ్ చేసి మరీ రెచ్చగొడితే వాళ్లు అలాగే రియాక్ట్ అవుతారు" అని రోహిత్ అన్నాడు.