Rohan Bopanna Karnataka CM Felicitaion : ఇటీవలే ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న స్టార్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్నను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సత్కరించారు. అంతే కాకుండా బోపన్నకు రూ.50 లక్షల నగదు బహుమతిని అందజేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఫొటోలను కర్ణాటక సీఎం తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
''ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్‌లో టైటిల్ గెలుచుకున్న రోహన్ బోపన్నను ఇవాల కలిసి అభినందించాను. దీంతో పాటు బోపన్నకు రూ. 50 లక్షల బహుమతిని అందజేయనున్నట్లు ప్రకటిస్తున్నాను.'' అంటూ సిద్ధరామయ్య పేర్కొన్నారు.
Rohan Bopanna Career : ఇక బోపన్న కెరీర్ విషయానికి వస్తే - కర్ణాటకలోని కూర్గ్ జిల్లాకు చెందిన బోపన్న తండ్రి కాఫీ ప్లాంటరు. తల్లి గృహిణి. తల్లిదండ్రులు ఇద్దరూ రోహన్‌ను బాగా సపోర్టు చేసేవారు. తనకు 11 ఏళ్ల వయసున్నప్పటి నుంచే అతడు టెన్నిస్ ఆడటం ప్రారంభించాడు. తొలుత ఈ క్రీడపై అంత మక్కువ చూపించని బోపన్న 19 ఏళ్ల సమయానికి టెన్నిస్‌నే అతడి కెరీర్‌గా మలుచుకున్నాడు. అలా 1996లో బోపన్న తన టోర్నమెంట్లో పాల్గొన్నాడు.
ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్)కు సంబంధించిన మ్యాచ్ ఆడిన బోపన్న తొలి మ్యాచ్‌లోనే జూనియర్ లెవెల్లోనే విజయం సాధించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో 2002లో జరిగిన డేవిస్ కప్‌లో ఇండియా తరఫున మొదటి సారి పోటీలో పాల్గొన్నాడు. 2012, 2016 ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్నాడు. 2017లో అతని మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.ఆ తర్వాత కెనడా ప్లేయర్ గాబ్రియేలా డాబ్రోస్కీ తో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ విన్ అయ్యాడు. 2023లో డేవిస్ కప్‌కు వీడ్కోలు పలికాడు.