Robin Uthappa on Pujara : 2024-25 బోర్డర్ గావాస్కర్ ట్రోఫీకి భారత్ సిద్ధమవుతోంది. టెస్టు ఛాంపియన్షిప్ టోర్నీలో ఫైనల్ చేరాలంటే భారత్‌తోపాటు ఆస్ట్రేలియాకు కూడా ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది. ఈ పర్యటనకు బీసీసీఐ ఇప్పటికే టీమ్ఇండియా జట్టును ప్రకటించింది. అయితే ఈ జట్టులో సీనియర్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారాకు చోటు దక్కలేదు.
ఈ సిరీస్‌కు సెలక్టర్లు అతడిని పక్కనపెట్టారు. అయితే టీమ్ఇండియా సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఓడడం వల్ల పుజారాను మళ్లీ జట్టులోకి తీసుకోవాలని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో పుజారా కమ్‌బ్యాక్ గురించి మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్ పర్యటనకు వెళ్లనున్న జట్టులో పూజారాకు ఇంకా చోటు ఉందని అన్నాడు.
'ఛెతేశ్వర్ పుజారాకు టీమ్ఇండియా టెస్టు జట్టులో ఇప్పటికీ స్థానం ఉంది. అతడిని వీలైనంత త్వరగా జట్టులోకి తీసుకోవాలి. జట్టుకు పుజారా అవసరం ఉందని నా అభిప్రాయం. మన బ్యాటింగ్ ఆర్డర్లో ఆరో నెంబర్ ప్లేయర్ వరకు అందరూ అగ్రెసివ్‌గా ఆడేవాళ్లే ఉన్నారు. కానీ, మనకు రాహుల్ ద్రవిడ్, పూజారా, కేన్ విలియమ్సన్, విల్ యంగ్ లాంటి ఆటగాళ్లు అవసరం. బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషిస్తూ ఇన్నింగ్స్‌లో చివరి వరకు ఉండగలిగే ప్లేయర్ ఎప్పటికీ అవసరమే' అని ఊతప్ప రీసెంట్గా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడాడు.
అలాగే సీనియర్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ గురించి కూడా మాట్లాడాడు. టీమ్ఇండియా ఎక్కువగా అశ్విన్‌పైనే ఆధారపడుతోందని అన్నాడు. 'అశ్విన్ ఫామ్‌లో లేకపోవడం తాత్కాలికమే. అతడు ఓ లెజెండ్. ఆస్ట్రేలియాకు నాథన్ లియాన్ ఎంత ముఖ్యమో, టీమ్ఇండియాకు అశ్విన్ కూడా అంతే కీలకం. భారత్ ఎక్కువగా అశ్విన్, బుమ్రాపై ఎక్కువగా ఆధారపడుతోంది' అని ఊతప్పు పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్‌లో భారత్- ఆసీస్ మధ్య ఐదు టెస్టులు జరగనున్నాయి. నవంబర్ 22న తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది.