Squeezed Lemon Benefits : నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులోని విటమిన్ C శరీరానికి చాలా అవసరం. అందుకే.. చాలా మంది ఉదయాన్నే నిమ్మ రసం తాగుతుంటారు. మరికొందరు వంటల్లో వినియోగిస్తుంటారు. అయితే.. నిమ్మరసం పిండుకున్న తర్వాత అందరూ ఆ తొక్కలను డస్ట్ బిన్లో పడేస్తారు. కానీ.. వాటితో ఎన్నోరకాల ఉపయోగాలు ఉన్నాయని మీకు తెలుసా? అవేంటో తెలుసుకుంటే ఇకపై మీరు ఎప్పటికీ నిమ్మకాయ తొక్కలను బయట పడేయరు అంటున్నారు నిపుణులు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
స్కూల్ కు వెళ్లే పిల్లలు ఉన్న తల్లులకు వాటిని క్లీన్ చేయడం ఓ సవాల్. సాక్సులు శుభ్రం చేసినా బూట్లు దుర్వాసన వస్తూనే ఉంటాయి. పిల్లలు గంటల తరబడి షూస్ వేసుకునే ఉండడం వల్ల చెమటతో తడిసిపోతాయి. ఫలితంగా బ్యాడ్ స్మెల్ వస్తుంటాయి. ఈ పరిస్థితిని నిమ్మ తొక్కలతో అడ్డుకోవచ్చు. ఇందుకోసం.. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత నిమ్మచెక్కలను షూస్‌లో ఉంచితే సరిపోతుందట. తెల్లవారే సరికి దుర్వాసన లేకుండా పోతుందని నిపుణులు సూచిస్తున్నారు.
బీట్‌రూట్, స్ట్రాబెర్రీ, నేరేడు వంటి పండ్లను కట్ చేస్తున్నప్పుడు.. ఆ రంగు చేతులకు అంటుకుంటుంది. వీటిని వదిలించుకోవడానికి కాస్త టైమ్ పడుతుంది. అయితే.. ఈ మరకలు వెంటనే తొలగిపోవాలంటే.. నిమ్మచెక్కతో రుద్దుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
జిడ్డుగా మారిన వంటింటి సింకును చక్కగా క్లీన్ చేయడానికి కూడా నిమ్మ తొక్కలు పనిచేస్తాయి. వీటితో రుద్దితే.. సింకు తళతళా మెరిసిపోతుందని, దుర్వాసన కూడా తొలగిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.
నిత్యం ఉపయోగించే టవల్స్‌పై ఏవైనా మరకలు పడితే.. తొందరగా వదలవు. ఇలాంటప్పుడు నిమ్మతొక్కను ప్రయోగిస్తే చక్కటి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మ తొక్కలు, వంటసోడా కలిపిన నీళ్లలో.. టవల్స్ నానబెట్టి, ఆ తర్వాత ఉతికితే ఎంత మొండి మరకైనా తొలగిపోతుందని చెబుతున్నారు.
ఈ రోజుల్లో చాలా మంది కూరగాయలు కట్ చేయడానికి ప్రత్యేకమైన బోర్డును ఉపయోగిస్తారు. దీనిపై ఏవైనా మరకలు ఉంటే.. నిమ్మ తొక్కలతో రుద్దితే చక్కటి ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లో ఉన్న అద్దాలు, బాత్ రూమ్ గోడలపైనా తరచూ మరకులు పడుతుంటాయి. వాటిని తొలగించడానికి కూడా నిమ్మ తొక్కలు పనిచేస్తాయట. నిమ్మతొక్కలను వెనిగర్‌లో వేసి రాత్రంతా నానబెట్టి, తెల్లవారిన తర్వాత కొన్ని నీళ్లు యాడ్ చేసి, ఓ సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఈ లిక్విడ్‌తో తుడిస్తే బాత్‌రూమ్ గోడలు, అద్దాలు శుభ్రం అవుతాయట.