Rise Of Afghanistan Cricket: క్రికెట్ ప్రపంచంలోకి అఫ్గానిస్థాన్ జట్టు పసికూనగా ఎంట్రీ ఇచ్చి రోజురోజుకూ ప్రదర్శన మెరుగుపర్చుకుంటుంది. కొంతకాలంగా అఫ్గాన్‌ను గమనిస్తే, ప్రపంచ క్రికెట్లో అంచెలంచెలుగా ఎదుగుతోంది. అటు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో, ప్రతిష్ఠాత్మకమైన ఐసీసీ టోర్నీల్లోనూ అఫ్గాన్ సంచలన విజయాలు నమోదు చేస్తూ అదరగొడుతుంది.
రషీద్ ఖాన్, రహ్మానుల్లా గుర్బాజ్, నవీన్ ఉల్ హక్, గుల్బాదిన్ నైబ్, మహ్మద్ నబీ వంటి ప్లేయర్లు సైతం స్టార్లుగా మారారు. ఇలా క్రికెట్లో ఎప్పటికప్పుడు పురోగతి సాధిస్తూ బలమైన జట్లకు సవాల్ విసురుతోంది. అయితే 2023 నుంచి అంతర్జాతీయ క్రికెట్లో అఫ్గాన్ నమోదు చేసిన సంచలన విజయాలపై ఓ లుక్కేద్దాం.
- అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్థాన్‌ను అఫ్గాన్ 2023 మార్చిలో తొలిసారి ఓడించింది. పాక్‌తో జరిగిన టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లో అఫ్గాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను అఫ్గాన్ 2-1 తేడాతో దక్కించుకుంది.
- 2023 వరల్డ్‌కప్‌లో బలమైన ఇంగ్లాడ్పై 63 పరుగుల తేడాతో నెగ్గి అఫ్గాన్ సంచలనం సృష్టించింది. వరల్డ్‌కప్‌లో అఫ్గాన్ టెస్టుల్లో ఆడుతున్న జట్టు (ఇంగ్లాండ్) ను ఓడించడం అదే తొలిసారి.
- 2023 ప్రపంచకప్‌లోనే చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో నెగ్గింది. వన్డేల్లో పాకిస్థాన్‌ను ఓడించడం అఫ్గాన్‌కు అదే మొదటిసారి కావడం విశేషం
- 2024 టీ20 వరల్డ్‌కప్‌లో క్రికెట్లోనే అత్యంత బలమైన ఆస్ట్రేలియాను ఓడించి ఔరా అనిపించింది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ 21 పరుగుల తేడాతో విజయం సాధించి, ఆసీస్ సెమీస్ అవకాశాలపై నీళ్లు చల్లింది.
- 2024 పొట్టి కప్ టోర్నీలో అత్యత్తమ ప్రదర్శన కనబర్చిన అఫ్గాన్ ఐసీసీ టోర్నీల్లో తొలిసారి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ వంటి బలమైన జట్ల నుంచి పోటీని తట్టుకొని సెమీస్‌కు అర్హత సాధించి అందరి దృష్టి ఆకర్షించింది.
- కాగా, ప్రస్తుతం దైపాక్షిక సిరీస్‌లో సౌతాఫ్రికాపై వన్డేల్లో తొలిసారి జయకేతనం ఎగురవేసింది. ఈ సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి తొలిసారి సౌతాఫ్రికాపై వన్డే సిరీస్ దక్కించుకుంది.
- అలాగే ఈ సిరీస్‌లో సౌతాఫ్రికాపై వన్డేల్లో తొలి సెంచరీ సాధించిన అఫ్గాన్ ప్లేయర్‌గా రహ్మానుల్లా గుర్బాజ్ ఘనత సాధించాడు.