Ricky Ponting On Gautam Gambhir :బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో పాల్గొనేందుకు భారత జట్టు ఇటీవల ఆస్ట్రేలియా బయల్దేరింది. ఆస్ట్రేలియాతో భారత్ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. నవంబర్ 22న తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ ప్లేయర్ టీమ్ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్‌పై ఆందోళన వ్యక్తం చేయగా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రీసెంట్గా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. అయితే గంభీర్ వ్యాఖ్యలపై పాంటింగ్ స్పందించాడు. విరాట్‌ను అపహాస్యం చేసేందుకు విమర్శించలేదని తాజాగా వెల్లడించాడు.
'విరాట్ టాప్ క్లాస్ క్రికెటర్. అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్. అయితే అతడి ఫామ్‌పై నేను ఇటీవల ఆందోళన వ్యక్తం చేశా. ఈ మాట విరాట్‌ను అడిగినా, అతడు కూడా అదే సమాధానం చెబుతాడు. అంతకుముందు కెరీర్లో సెంచరీల మీద సెంచరీలు బాదిన విరాట్ కొంతకాలంగా ఆ స్థాయిలో ఆడలేకపోతున్నాడు. ఇది ఏ మాత్రం అతడిని కించపరిచినట్లు కాదు. గతంలో ఆస్ట్రేలియాలో అతడు చాలా అద్భుతంగా ఆడాడు. తప్పకుండా మరోసారి చెలరేగేందుకు అవకాశం ఉంది. అయితే గంభీర్ కామెంట్స్‌కు నేను షాక్ అయ్యేవాడిని కాదు. కానీ, కోచ్ స్థాయిలో ఉంటూ అతడు స్పందించిన విధానమే నన్ను సర్‌ప్రైజ్ చేసింది' అని పాంటింగ్ అన్నాడు.
చుక్కలు చూపిస్తాడు
విరాట్ కోహ్లీపై పాంటింగ్ చేసిన కామెంట్స్‌ను ఆసీస్ మాజీ ప్లేయర్ షేన్ లీ కూడా తప్పుబట్టాడు. ప్రతిష్ఠాత్మకమైన సిరీస్ ముందు ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదన్నాడు. 'రికీ పాంటింగ్ నువ్వు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సరైనవి కావు. వరల్డ్ టాప్ క్లాస్ ప్లేయర్లో ఒకరైన విరాట్‌ని రెచ్చగొట్టేలా మాట్లాడటం మంచిది కాదు. అతడు ఒక్కసారి కుదురుకుంటే ఆసీస్‌కు మళ్లీ చుక్కలు చూపిస్తాడు' అని షేన్ లీ పేర్కొన్నాడు.