RCB vs GG WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో గుజరాత్ జెయింట్స్ జట్టు ఎట్టకేలకు విజయం నమోదు చేసింది. టోర్నీలో ఆడిన ఐదో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 19 పరుగుల తేడాతో ఓడించి తొలి విజయాన్ని నమోదు చేసింది. 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేసింది. జార్జియా వేర్‌హమ్ (48 పరుగులు), రిచా ఘోశ్ (30 పరుగుల) రాణించారు. గుజరాత్ బౌలర్లలో ఆష్లీ గార్డ్నర్ 2, క్యాథ్రిన్ బ్రేస్, తనుజా కన్వర్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో నాలుగు రనౌట్లు నమోదవ్వడం గమనార్హం. భారీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న గుజరాత్ బ్యాటర్ హెత్ మూనీ (85*)కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి నాలుగో ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫుల్ ఫామ్‌లో ఉన్న తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (4) స్వస్ప స్కోరుకే వెనుదిరిగింది. ఆ తర్వాత కెప్టెన్ స్మృతి మంధాన (24 పరుగులు), ఎల్లీస్ పెర్రీ (24 పరుగులు), సోఫీ డివైన్ (23 పరుగులు) భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. ఆఖర్లో జార్జియా వేర్‌హమ్ బౌండరీలతో మెరుపులు మెరిపించి, గుజరాత్‌ను కాస్త ఆందోళనకు గురి చేసింది. కానీ, 19 ఓవర్ చివరి బంతికి జార్జియా రనౌట్ కావడం వల్ల గుజరాత్ ఊపిరిపీల్చుకుంది.