Tata Group Helped Cricketers :ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా క్రీడలపై అమితమైన ప్రేమ చూపేవారు. ముఖ్యంగా క్రికెట్‌పై ఆయనకు ఆప్యాయత ఎక్కువ. ఈ క్రమంలోనే కొన్నేళ్లుగా భారత క్రికెట్లో అనేక మంది ఆటగాళ్లకు టాటా గ్రూప్ మద్దతుగా నిలుస్తూ వస్తోంది. టాటా గ్రూప్‌లోని పలు కంపెనీలు మన క్రికెటర్లకు ఉద్యోగావకాశాలు కల్పించాయి. అలాగే వారి ప్రొఫషనల్ కెరీర్‌కు అర్థికంగానూ టాటా గ్రూప్ కంపెనీలు మద్దతుగా నిలిచి తోడ్పాటు అందించాయి. అలాగే వారికి స్పాన్సర్లుగానూ నిలిచాయి. అలా టాటా గ్రూప్ నుంచి మద్దతుతో పలువురు క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టారు. వారెవరంటే?
మాజీ క్రికెటర్ ఫరోఖ్ ఇంజనీర్‌కు టాటా మోటార్స్ మద్దతుగా నిలిచింది. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, భారత స్టార్ మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, ఇతర క్రికెటర్లు హర్భజన్ సింగ్, రాబిన్ ఉతప్ప, సంజయ్ మంజ్రేకర్, శ్రీనాథ్, కైఫ్‌కు తమ గ్రూప్‌లో ఉద్యోగాలు కల్పించింది. ఈతరం క్రికెటర్లు శార్దూల్ ఠాకూర్, జయంత్ యాదవ్ కూడా టాటా గ్రూప్ నుంచి సాయం అందుకొన్నవారే. టాటా పవర్స్, స్టీల్స్, ఎయిర్‌వేస్ విభాగాల్లో టాటా గ్రూప్ ఆయా క్రికెటర్లకు ఉద్యోగావకాశాలు కల్పించింది. దీంతోపాటు వారికి స్పాన్సర్ చేస్తూ వెన్నంటి ఉండి ప్రోత్సహించింది.
'రతన్ టాటా ఓ గొప్ప వ్యాపారవేత్త మాత్రమే కాదు, సమాజానికి తిరిగి ఇచ్చే విశయంలో మనందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. విద్య, ఆరోగ్య రంగాల్లో మార్పులు తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ఆయన జీవితం ఒక ఆదర్శం' అని యువరాజ్ సింగ్ ట్వీట్ చేశారు