Champions Trophy 2025 India Wicket Keeper: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ చివరి వన్డే సిరీస్‌లో అదరగొట్టింది. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో 142 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ 3- 0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక భారత్ ఛాంపియన్స్ ట్రోఫీపై దృష్టి పెట్టింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలో దిగనుంది. ఈ క్రమంలో రెండు రోజుల్లో ఈ టోర్నీ కోసం భారత జట్టు దుబాయ్ వెళ్లనుంది.
అయితే టీమ్ఇండియా తుది జట్టు ఎలా ఉండనుంది? అని అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తోంది. ముఖ్యంగా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌గా యంగ్ సెన్సేషన్ రిషభ్ పంత్‌కు జట్టులో చోటు ఉంటుందా? లేదా ఇంగ్లాండ్ సిరీస్‌లో రాణించిన కేఎల్ రాహుల్‌ను బరిలోకి దించుతుందా? అని సర్వత్రా అసక్తి నెలకొంది. దీనిపై టీమ్ఇండియా హెడ్ కోచ్ గంభీర్ క్లారిటీ ఇచ్చాడు.
'అతడే నెంబర్ వన్'
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ఇండియాకు వికెట్ కీపర్‌గా కేఎల్ రాహులే ఫస్ట్ ఛాయిస్ అని గంభీర్ తెలిపాడు. 'కేఎల్ రాహుల్ ఇప్పుడు మా నంబర్ వన్ వికెట్ కీపర్. ఇప్పటికైతే ఇదే చెప్పగలను. రిషభ్ పంత్ ఏ క్షణంలోనైనా అవకాశం రావచ్చు. కేఎల్ రాహుల్ రాణిస్తున్నాడు. అయితే, ఒకే మ్యాచ్‌లో ఇద్దరు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్లతో ఆడలేం. ఐదో స్థానంలోనే రాహుల్‌ను ఆడిస్తారా? అంటే అదీ కూడా స్పష్టంగా చెప్పలేం. ఏ ప్లేయర్ అయినా ఐదో స్థానంలో ఆడొచ్చు. ఆటగాడికన్నా జట్టు ప్రయోజనాలే ముఖ్యం. ఆ సమయంలో రికార్డులు చూడం. ఏ ఆటగాడు బాగా రాణించగలడో మాత్రమే చూస్తాం' అని గంభీర్ చెప్పుకొచ్చాడు.