Rahul Dravid Special Message To Gambhir :టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ టీమ్ఇండియా శిక్షణ నిమగ్నమయ్యారు. శ్రీలంక వేదికగా జరగనున్న టోర్నీల కోసం ప్లేయర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గంభీర్‌ను ఓ స్పెషల్ వ్యక్తి సర్ప్రైజ్ చేశాడు. ఓ స్వీట్ వాయిస్ మెసేజ్‌ను పంపించిన ఆయన అందులో గంభీర్‌తో తనకున్న అనుభవాలను పంచుకున్నాడు. ఇంతకీ ఆయనెవరో కాదు మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్ చేయగా, ప్రస్తుతం అది నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
"హలో గౌతమ్. ప్రపంచంలోనే అత్యంత ఉత్సాహవంతమైన ఉద్యోగంలోకి నిన్ను స్వాగతిస్తున్నాను. భారత జట్టుతో నా ప్రయాణం ముగిసి ఈ రోజుతో మూడు వారాలవుతోంది. నా కలలకు మించి ఎంతో గొప్పగా బార్బడోస్‌లో రిటైరయ్యాను. ముంబయిలో జరిగిన ఆ సాయంత్రాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. అన్నింటికంటే ఎక్కువగా జట్టుతో నా రిలేషన్, జ్ఞాపకాలను ఎప్పటికీ పదిలంగా ఉంచుకుంటాను. కొత్త కోచ్‌గా నువ్వు బాధ్యతలు చేపట్టావు. నువ్వు కూడా ఇలాంటి అద్భుతమైన సమయాన్ని ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నా. భారత క్రికెట్‌పై నీ అంకితభావం నాకు తెలుసు. కోచ్‌గా వాటన్నింటిని అత్యుత్తమంగా ప్రదర్శించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మనపై ఎటువంటి అంచనాలు ఎలా ఉంటాయో నీకు తెలుసు. కష్టాల్లోనూ నువ్వు ఒంటరివాడివి కాదు. ప్లేయర్స్, సపోర్ట్ స్టాఫ్, మేనేజ్‌మెంట్ నుంచి ఎల్లప్పుడూ నీకు సపోర్ట్ ఉంటుంది" అని ద్రవిడ్ తెలిపాడు.