PT Usha Lifetime Achievement Award : భారత దిగ్గజ స్ప్రింటర్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషకు తాజాగా అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా , దిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆమెను 'లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్' అవార్డుతో సత్కరించింది. దిల్లీలోని నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, భారత మాజీ షూటర్ జస్పాల్ రాణా ఈ సభకు హాజరయ్యారు. ఇక అవార్టును అందుకున్న పీటీ ఉష భావోద్వేగానికి లోనయ్యారు.
"నా కెరీర్‌లో సాధించిన విజయాలన్నింటినీ నేటికీ గుర్తుంచుకుంటున్నందుకు కృతజ్ఞతలు. నేను భారత్ తరఫున ఆడుతున్న సమయంలో ఇప్పటి క్రీడాకారులకు ఉన్న విదేశీ శిక్షణ, పోషకాహారం, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ వంటి సౌకర్యాలు మాకు లేవు. ప్రస్తుతం నేను ఐవోఏలో విధులు నిర్వర్తిస్తున్నాను. ఇప్పుడు మా దృష్టంతా పారిస్ ఒలింపిక్స్‌పైనే ఉంది. 2036 నాటికి భారతదేశాన్ని క్రీడా శక్తిగా మార్చాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాగుతున్నారు. పారిస్ ఒలింపిక్స్ తర్వాత దీనిపై దృష్టిసారిస్తాం" అని పీటీ ఉష అన్నారు.