President Murmu Meets Olympics Players:భారత ఒలింపిక్ క్రీడాబృందంతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తాజాగా భేటీ అయ్యారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో మన అథ్లెట్లతో ఆమె ముచ్చటించారు. ముఖ్యంగా పతక విజేతలు పీఆర్ శ్రీజేశ్, మను భాకర్‌లతో రాష్ట్రపతి ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ ఇద్దరూ పారిస్ ఒలింపిక్స్‌లో తమ జర్నీ గురించి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ ప్రత్యేక ఆహ్వానాన్ని ఇచ్చినందుకు రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను రాష్ట్రపతి అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లో పంచుకున్నారు.
నీ ప్రదర్శన స్ఫూర్తిగా నిలుస్తుంది
గతంలో నీరజ్ చోత్ర రజత పతకం సాధించినప్పుడు రాష్ట్రపతి ముర్ము అతడ్ని అభినందించారు. "నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అతడిని అభినందనలు. వరుస ఒలింపిక్స్ గేమ్స్‌లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన తొలి భారత అథ్లెట్‌గా సెన్సేషనల్ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. నీరజ్‌ను చూసి భారత దేశమంతా గర్విస్తోంది. వచ్చే తరాలకు అతడి సాధించిన ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. రాబోయే రోజుల్లోనూ భారత్‌కు అతడు మరిన్ని పతకాలు సాధించాలని, కీర్తిని తీసుకురావాలని దేశమంతా ఎదురు చూస్తోంది" అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన ఎక్స్‌లో రాసుకొచ్చారు.
ఇదిలా ఉండగా, హాకీ టీమ్ కాంస్య పతక విజేతలుగా నిలిచినప్పుడు కూడా వారిని రాష్ట్రపతి కొనియాడారు. "ఐదు దశాబ్దాల తర్వాత భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో వరుసగా పతకాలు సాధించింది. భారత హాకీ పునరుజ్జీవానికి ఈ టీమ్ చేసిన కృషి ప్రశంసనీయం. నిలకడ, నైపుణ్యం, సమన్వయం, పోరాటం ద్వారా క్రీడాకారులు చూపిన ప్రదర్శన యువతకు స్ఫూర్తిదాయకం." అని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు.