Police Complaint on Ex Cricketers : టీమ్ఇండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్‌పై ఫిర్యాదు నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ (NCPEDP) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ పోలీసులకు కంప్లైంట్ చేశారు. దిల్లీలోని అమర్ కాలనీ పోలీస్ స్టేషన్ SHOకి ఆయన ఫిర్యాదు చేశారు. క్రికెటర్లతో పాటు, మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ సంధ్యా దేవనాథన్‌పై కూడా ఫిర్యాదు చేశారాయన.
కంప్లైంట్ ఎందుకు చేశారంటే? - ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తౌబా తౌబా పాట బాగా ట్రెండ్ అవుతోంది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన బ్యాడ్ న్యూస్ సినిమాలోని ఈ సాంగ్ హుక్ స్టెప్‌ను చాలా మంది తమ స్టైల్స్‌లో రీక్రియేట్ చేస్తున్నారు. తాజాగా వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024గా నిలిచిన మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా కూడా రీక్రియేట్ చేశారు. అందులో వారు నడుము పట్టుకుని, కుంటుకుంటూ నడుస్తూ కామెడీ చేశారు. "15 రోజుల పాటు క్రికెట్ ఆడాక మా శరీరాలు కూడా తౌబా తౌబా అయ్యాయి" అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు.
అయితే దీనిపై ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేయగా దివ్యాంగుల హక్కుల కార్యకర్తలు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇలా చేయడం దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీయడమేనని అంటున్నారు. ఈ క్రమంలోనే నేషనల్ సెంటరన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ కూడా మాజీ క్రికెటర్లను విమర్శించారు. "దేశం మొత్తం హీరోలుగా భావించే వ్యక్తుల నుంచి ఇలాంటి అమర్యాదకర ప్రవర్తన రావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది వారి దిగజారుడుతనానికి నిదర్శనం. చాలా సిగ్గుచేటు. దీనిపై బీసీసీఐ చర్యలు తీసుకోవాలి" అని పేర్కొన్నారు. అనంతరం క్రికెటర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.