Parthiv Patel On Rohit Sharma:ఓ పక్క క్రికెట్ అభిమానులు ఐపీఎల్ 17 ఎడిషన్ కోసం ఎదురుచూస్తుండగా, చాలా మంది ముంబయి ఇండియన్స్ అభిమానులు మాత్రం నిరాశలో ఉన్నారు. అందుకు కారణం ముంబయి కెప్టెన్‌గా కాకుండా సాధారణ ప్లేయర్‌గా రోహిత్ శర్మ ఐపీఎల్ ఆడబోతున్నాడు. కెప్టెన్‌గా ముంబయికి ఐదు టైటిల్స్ అందించిన హిట్‌మ్యాన్ దాదాపు పదేళ్ల తర్వాత కెప్టెన్‌గా కాకుండా బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దిగనున్నాడు. గతేడాది చివర్లో రోహిత్‌ని పక్కనపెట్టి ముంబయి ఇండియన్స్ మేనేజ్‌మెంట్ హార్దిక్ పాండ్యకి కెప్టెన్సీ అందించింది.
పాండ్య కెప్టెన్సీ ప్రకటనతో చాలా మంది అభిమానులు షాక్ అయ్యారు. మాజీ ఆటగాళ్లు, ఇతర ప్లేయర్‌లు కూడా ఈ నిర్ణయం సరైంది కాదనే రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఇంతలో మార్చి 22న ఐపీఎల్ మొదలవుతోంది, MI మొదటి మ్యాచ్ మార్చి 24న గుజరాత్‌తో ఆడనుంది. ఈ క్రమంలో జియో సినిమా లెజెండ్స్ లాంజ్ టీవీ షోలో, భారత్ మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ రోహిత్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. MIతో ఉన్నప్పుడు చోటు చేసుకున్న కీలక పరిమాణాల గురించి పార్థివ్ ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం.
రోహిత్ లేకుంటే పాండ్యా లేడు?రోహిత్ లేకుంటే బుమ్రా, హార్దిక్ చాలా కాలం క్రితమే ముంబయి ఇండియన్స్ నుంచి బయటకు వచ్చుండేవారని పార్థివ్ చెప్పాడు. ఆ తర్వాత ముంబయిలో బుమ్రా, పాండ్యా ఎంత కీలకంగా మారారో అందరికీ తెలిసిన విషయమే. పార్థివ్ మాట్లాడుతూ 'రోహిత్ ఎల్లప్పుడూ ప్లేయర్స్‌కి అండగా ఉంటాడు. ఉదాహరణకు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా. బుమ్రా 2014లో MIలో చేరాడు, 2015లో మొదటి సీజన్ ఆడినప్పుడు, గొప్పగా రాణించలేదు. అప్పుడు బుమ్రాని ముంబయి వదులుకోవాల్సింది. కానీ బుమ్రా రాణిస్తాడని, టీమ్‌లో కొనసాగించమని రోహిత్ చెప్పాడు. 2016 నుంచి బుమ్రా ఏ స్థాయికి చేరుకున్నాడో అందరికీ తెలుసు' అన్నాడు.
హార్దిక్ పాండ్యా విషయంలోనే ఇలానే జరిగింది. 2015లో ఫర్వాలేదు గానీ, 2016లో సరిగా రాణించలేదు. సాధారణంగా అన్‌క్యాప్డ్ ప్లేయర్స్‌ని ఫ్రాంచైజీలు త్వరగా వదులుకుంటాయి. రంజీ ట్రోఫీ లేదా ఇతర డొమెస్టిక్ మ్యాచ్‌లలో రాణించాక తిరిగి వెనక్కి తీసుకోవచ్చు. కానీ రోహిత్ అలా జరగనివ్వలేదు. అందుకే ఈ రోజు బుమ్రా, పాండ్యా ఈ స్థాయిలో ఉన్నారని పార్థివ్ వివరించాడు. అలానే పార్థివ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ గురించి కూడా మాట్లాడాడు. 'జోస్ బట్లర్ గురించి చెప్పవచ్చు. 2017 సీజన్‌లో, నేను ఓపెనర్‌గా టీమ్‌కి ఎక్కువ ఉపయోగపడగలనని రోహిత్ భావించాడు. రోహిత్ తన పొజిషన్ మార్చుకున్నాడు. నేను జోస్ బట్లర్‌తో కలిసి ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాను' అని చెప్పాడు.