Paris paralympics 2024 Avani Lekhara :అవని లేఖరా ఇప్పుడీ పేరు మార్మోగిపోతోంది. ప్రస్తుతం జరుగుతోన్న పారాలింపిక్స్‌లో పసిడి సాధించింది. 2020 టోక్యో పారాలింపిక్స్, 2024 పారిస్ పారాలింపిక్స్, సంవత్సరాలు, వేదికలు మాత్రమే మారాయి. కానీ అవని లేఖరా పసిడి గురి మాత్రం తప్పలేదు. అప్పుడూ ఇప్పుడూ పారాలింపిక్స్ రికార్డును బ్రేక్ చేసి గోల్డ్‌ను పట్టేసింది. తద్వారా పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు నెగ్గిన రెండో భారత అథ్లెట్‌గా నిలిచింది. అలానే ఈ ఘనత సాధించిన తొలి మహిళా అథ్లెట్‌గానూ నిలిచింది.
నొప్పిని భరిస్తూ సాధన(Avani Lekhara Gold Medal) - 19 ఏళ్లకే టోక్యో పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన అవనిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టే ఆమె నిలకడ ప్రదర్శనను కొనసాగిస్తూ ప్రపంచ కప్‌ల్లో కూడా గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్స్ సాధించింది. గతేడాది ఆసియా పారా క్రీడల్లోనూ ఛాంపియన్‌గా అవతరించింది.
అయితే ఈ ఏడాది మార్చిలో దిల్లీ వేదిగా జరిగిన ప్రపంచ కప్‌లో మాత్రం రెండూ బ్రాండ్ మెడల్స్నే సాధించింది. ఇది ఆమె స్థాయికి తగ్గ ప్రదర్శన కాదు. వాస్తవానికి పిత్తాశయంలో రాళ్ల కారణంగా తీవ్రమైన నొప్పిని అనుభవించింది అవని. ఆ ప్రభావం ఆమె గురి తప్పేలా చేసింది. అందుకే బ్రాంజ్ మెడల్స్‌తో సరిపెట్టుకుంది. అయినప్పటికీ నొప్పిని భరిస్తూనే 2023 నుంచి అవని ఆటను కొనసాగించింది. ఇక పారిస్ పారాలింపిక్స్ వచ్చిన నేపథ్యంలో ఈ ఏడాది(2024) మార్చిలో శస్త్రచికిత్స(Avani Lekhara Surgery) చేయించుకుని పిత్తాశయాన్ని తొలగించుకుంది.
అనంతరం రెండు నెలలు రెస్ట్ తీసుకుని ప్రాక్టీస్ మొదలెట్టింది. అయితే సర్జరీ కారణంగా ఆమె కండరాలు బలహీనంగా మారాయి. సాధనలో ఆమె శరీరం చాలా సార్లు వణికేది. కానీ ఆటపై ఉన్న ప్రేమ, నిబద్ధత, అంకిత భావం, పారాలింపిక్స్‌లో గోల్డ్ అందుకోవాలనే తపన, ఆమెలో బలాన్ని పెంచాయి.
అలా దిల్లీ ప్రపంచ కప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మోనాను దాటి ఇప్పుడు అవని మళ్లీ ఛాంపియన్‌గా అవతరించింది.