Paris Olympics India:పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత అథ్లెట్ల పోరాటం కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత్ ఖాతాలో మూడు కాంస్యాలు మాత్రమే చేరాయి. అవన్నీ షూటింగ్లో రావడం విశేషం. రీసెంట్గా శనివారం జరిగిన 25మీటర్ల పిస్టల్ ఈవెంట్లో త్రుటిలో భారత్‌కు మరో కాంస్యం దూరమైంది. ఇక ఆదివారం (ఆగస్టు 4) భారత్ నుంచి మేజర్ ఈవెంట్లలో పలువురు అథ్లెట్లు పోటీపడుతున్నారు. అందులో రెండు ఈవెంట్లలో మన అథ్లెట్లు పతకానికి అడుగు దూరంలో ఉన్నారు. దీంతో ఆదివారం అథ్లెట్లు మంచి ప్రదర్శన చేసి పతకాల సంఖ్య పెంచాలని అభిమానులు ఆశిస్తున్నారు.
అందరి కళ్లు లక్ష్యవైపే
భారత యంగ్ షట్లర్ లక్ష్యసేన్‌పై భారీ ఆశలు నెలకొన్నాయి. ప్రస్తుత క్రీడల్లో బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో అజేయంగా సెమీస్‌కు దూసుకొచ్చిన లక్ష్య ఆదివారం మరో కీలక పోరుకు సిద్ధమయ్యాడు. ఇక్కడ నెగ్గి పసిడి పోరుకు అర్హత సాధించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బ్యాడ్మింటన్లోనైనా పతకం రంగు మారాలని కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో లక్ష్యసేన్ వరల్డ్ నెం.2 విక్టర్ ఆక్సెల్సెన్ (డెన్మార్క్)తో తలపడనున్నాడు. ఈ పోరు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది.
లవ్లీనాపై ఆశలెన్నో
మహిళల బాక్సింగ్‌లో లవ్లీనా బొర్గొహెయిన్ ఆదివారం క్వార్టర్ ఫైనల్స్ ఆడనుంది. ఆమె లి క్వియాన్ (చైనా)తో 75కేజీల బాక్సింగ్‌లో తలపడనుంది. గంపెడన్ని ఆశలతో లవ్లీనా ఈ మ్యాచ్‌లో బరిలో దిగనుంది. మరో మ్యాచ్ నెగ్గితే లవ్లీనాకు దాదాపుగా పతకం దక్కే ఛాన్స్ ఉంది. ఇక రీసెంట్గా జరిగిన మరో ప్రీ క్వార్టర్స్‌లో నిఖత్ జరిన్ ఓడడం వల్ల బాక్సింగ్‌లో లవ్లీనాపైనే అందరు ఆశలు పెట్టుకున్నారు.