Trump Harris Swing State Polls : అమెరికా స్వింగ్ రాష్ట్రాల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని తాజా ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. ముఖ్యంగా నెవడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో కమలా హారిస్‌కు మంచి ఆదరణ లభిస్తుండగా; ఆరిజోనాలో డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రజల నుంచి భారీగా మద్దతు లభిస్తోందని పోల్స్ చెబుతున్నాయి. ఇక స్వింగ్ రాష్ట్రాల్లోని మిషిగన్, జార్జియా, పెన్సిల్వేనియాల్లో ఈ ఇరువురు నేతల మధ్య గట్టిపోటీ నెలకొన్నట్లు ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 2 వరకు ఈ కీలక రాష్ట్రాల్లో ది న్యూయార్క్ టైమ్స్- సైనా పోల్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
మరో రెండు రోజులే!
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకున్న వేళ డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌లు మరింత ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి అధ్యక్ష ఎన్నికలకు ఇంకా రెండు రోజులే గడువుంది. ఇప్పటికే ముందస్తు ఓటింగ్ ద్వారా పోలింగ్ కొనసాగుతోంది కూడా. ఈ క్రమంలో స్వింగ్ స్టేట్స్‌లో వీరిద్దరి మధ్య పోటీ హోరాహోరీగా ఉండనున్నట్లు తాజా ఒపీనియన్ పోల్స్ పేర్కొంటున్నాయి.
ఎవరిని విజయం వరిస్తుందో?
అమెరికా అధ్యక్ష బరిలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌తో పాటు అనేక మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు. రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్, కార్నెల్ వెస్ట్‌లు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. గ్రీన్ పార్టీ నుంచి జిల్ స్టీన్, లిబర్టేరియన్ పార్టీ నుంచి చేజ్ ఓలివర్‌లు కూడా పోటీ చేస్తున్నారు. ప్రధాన పోటీ మాత్రం రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ మధ్యే కొనసాగే అవకాశం ఉంది. అమెరికాలో దాదాపు 24.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఇప్పటికే 7.5 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.