Karthika Puranam 3rd Day In Telugu : వశిష్ఠుడు జనకమహారాజుతో " ఓ జనకరాజా! శ్రద్ధగా విను. మనం చేసిన పాపాలన్నిటినీ నశింప చేయగల శక్తి ఒక్క కార్తీకమాస వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీకమాస శుక్లపక్షంలో వనభోజనం చేసినవారు పాప విముక్తులై విష్ణు ధామాన్ని పొందుతారు. ఈ మాసంలో ఒక్కరోజైనా ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి గంధ పుష్పాక్షతలతో పూజించి, యధాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి, వారితో కలిసి భోజనం చేయాలి.
కాబట్టి, ఓ జనక మహారాజా! ఈ కార్తీక మహత్యాన్ని భక్తిశ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడు సంకటం నుంచి రక్షణ పొందాడు. ఆ కథ చెప్తాను, విను అంటూ చెప్పసాగెను.
తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుని కథ
భరతఖండమునందు దక్షిణ ప్రాంతమున ఒక గ్రామమునందు తపశ్శాలి, సత్యనిష్టుడు అయిన 'తత్వనిష్ఠుడు' అను బ్రాహ్మణుడు కలడు. ఒకనాడు అతడు తీర్ధయాత్ర చేయ సంకల్పించి గోదావరి తీరానికి బయలుదేరాడు. ఆ తీర్థ సమీపంలో ఉన్న మహా వటవృక్షముపై భయంకరమైన ముగ్గురు బ్రహ్మ రాక్షసులు అక్కడికి వచ్చే యాత్రికులను భయపెడుతూ, వారిని భక్షించుతూ కాలక్షేపం చేసేవారు. పితృదేవతలకు పిండతర్పణం చేయుటకు వచ్చిన ఆ విప్రుని కూడా రాక్షసులు యథాప్రకారంగా చంపబోగా, ఆ విప్రుడు భయముతో గజ గజ వణుకుతూ, బిగ్గరగా నారాయణ మంత్రాన్ని పఠిస్తూ, ఓ ఆర్తత్రాణ పరాయణా! నన్ను ఈ ఆపద నుంచి కాపాడు తండ్రీ! అని పలు విధములుగా వేడుకున్నాడు.
బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం
విప్రుని ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులు జ్ఞానోదయం కలిగి "ఓ మహానుభావా! నీ నోటి వెంట వచ్చిన శ్రీమన్నారాయణ మంత్రం విన్న వెంటనే మాకు జ్ఞానోదయం కల్గింది. మాకు రాక్షస జన్మ నుంచి విముక్తి కలిగించి,మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారు. అంతట ఆ విప్రుడు ఓయి! మీరెవరు? మీకు ఈ వికృత రూపాలు ఎలా వచ్చాయో చెప్పండి? మీ బాధలు తొలగే దారి చెబుతాను" అని అన్నాడు.
మొదటి బ్రహ్మ రాక్షసుని పూర్వ జన్మ వృత్తాంతం
అంతట మొదటి బ్రహ్మరాక్షసుడు ఇలా చెప్పసాగాడు. "ఓ విప్రోత్తమా! నా పేరు ద్రావిడ. నేను ద్రావిడ దేశమునందు గల మంథరమనే గ్రామానికి అధికారిగా ఉండేవాడిని. స్వతహాగా బ్రాహ్మణుడనై ఉండి కూడా నా కుటుంబ శ్రేయస్సుకై ఇతర విప్రుల ధనాన్ని హరించాను. బంధువులకు గాని, బ్రాహ్మణులకు గాని ఒక్క నాడు కూడా పట్టెడన్నం పెట్టి ఎరగను. ఇటువంటి పాపకర్మల వల్ల నాతో పాటుగా ఏడు తరాల వారు అధోగతి పాలయ్యారు. నేను నా మరణానంతరం నరకయాతన అనుభవించి బ్రహ్మరాక్షసుడనయ్యాను. నాపై దయ ఉంచి ముక్తి మార్గాన్ని తెలియచేయమని కోరాడు.
రెండవ బ్రహ్మ రాక్షసుని పూర్వ జన్మ వృత్తాంతం
రెండవ బ్రహ్మరాక్షసుడు విప్రునితో "ఓ ద్విజోత్తమా! నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక బాధపెడుతూ, వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో మృష్టాన్న భోజనం చేస్తుండేవాడిని. నేను ఎట్టి దానధర్మములు చేసి ఎరగను. నా బంధువులను హింసించి, వారి ధనము కూడా అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని. అందుకే మరణానంతరం నాకు ఈ బ్రహ్మరాక్షసుని రూపం కలిగింది. నన్ను ఉద్ధరింపుము" అని వేడుకొనెను.
మూడవ బ్రహ్మ రాక్షసుని పూర్వ జన్మ వృత్తాంతం
చివరగా మూడవ బ్రహ్మరాక్షసుడు కూడా "ఓ మహాశయా! నేనొక సంపన్న కుటుంబంలో పుట్టాను. నేను ఓ విష్ణువు ఆలయంలో అర్చకునిగా ఉండేవాడిని. స్నానమైన చేయకుండా కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేవాడిని. భగవంతునికి ధూపదీప నైవేద్యాలతో సమర్పించకుండా భక్తులు దేవుని కోసం తెచ్చిన కానుకలను నా ఉంపుడుగత్తెకు అందజేస్తూ ఉండేవాడిని. బ్రాహణుడినై ఉండి కూడా మద్య మాంసాలు సేవిస్తూ ఉన్నందున మరణానంతరం నాకు ఈ బ్రహ్మ రాక్షసత్వం వచ్చింది. నన్ను రక్షింపుము" అని వేడుకున్నాడు.
బ్రహ్మ రాక్షసులను ఉద్ధరించిన విప్రుడు
అంతట ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ రాక్షసులతో "ఓ బ్రహ్మ రాక్షసులారా భయపడకండి, నాతో రండి మీకు ముక్తి కలిగించెదనని చెప్పి, వారి యాతన విముక్తికై సంకల్పం చెప్పుకుని తాను స్వయంగా గోదావరి నదీ స్నానం చేసి ఆ పుణ్యాన్ని ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు ధారపోయగా వారికీ వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకేగిరి.
కావున "ఓ జనకమహారాజా! ఎవరైతే కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తారో వారికి జన్మాంతర పాపాలు నశించి మోక్షాన్ని పొందుతారు" అని వశిష్ఠులవారు జనకునికి హితబోధ చేసారు.
ఇతి స్మాందపురాణ కార్తీకమహాత్మ్యే తృతీయాధ్యాయే సమాప్తః.
ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.